నింగికేగిన స్వర రారాజు


Wed,June 20, 2018 02:41 AM

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ఎవరెస్టు శిఖరం ఏకశిలగా మారిపోయింది. లక్షల గొంతుల స్వరంలో ధ్వనిగా మారిన ధ్వనిసార్వభౌముడు వెళ్లిపోయాడు. టెన్ కమండ్‌మెంట్స్ నలుదిక్కులా ధ్వనిస్తూ దివికేగిండు. నేరెళ్ల వేణుమాధవ్ చరిత్ర చెక్కిన శిల్పం. మరచిపోని స్వరం. మరపురాని స్వర మాంత్రికుడు. లక్షల కొలది గొంతుకల్ని తన స్వరంలో బంధించిన బహుముఖీనుడు. అపార సాధనా సంపతితో అనితర సాధ్యమైన పటుత్వంతో లోకానికి తానేమిటో, తన వల్ల లోకానికేమిటో ఆచరించి నిరూపించిన అసాధ్యుడు. అజాతశత్రువు. ఓరుగల్లు పొత్తిళ్లల్లో పుట్టి పెరిగిన స్వరమాధుర్యం అతను. తనే ఒక కళాగా ఎదగిన కళాప్రపూర్ణుడు. దేశదేశాల్లో ఓరుగల్లు ఖ్యాతిని నిలిపిన మహోన్నత వ్యక్తిత్వ సంపన్నుడు. వరంగల్‌లో ఏ చిన్న సాంస్కృతిక, భాషా పండిత, పామర కార్యక్రమం నిర్వహించినా కాళోజీ అన్నట్టు వాడేపార్టీ వాడు కాదు.. ఏ పార్టీ వాడన్నట్టే నేరెళ్ల కూడా పిలిచింది ఎవరు? పండితుడా పామరుడా? అని చూడరు.

పిలిచిందే తడవుగా సతీసమేతంగా, రాత్రి అయినా, పగలైనా వచ్చి ఆసాంతం ఉండిపోయే సంస్కార సంపన్నుడు. ఓరుగల్లు నుంచి ఓ తార మళ్లీ నేరెళ్లరూపంలో దివికేగింది. డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ విశ్వవిఖ్యాత ధ్వనిసార్వభౌమ, ధ్వన్యనుకరణ సామ్రాట్. పద్మశ్రీ. ఇలా రాస్తే పేజీలు సరిపోని బిరుదులు. సత్కారాలు. మూడు విశ్వవిద్యాలయాలు ఆయన కళాసేవకు గౌరవ డాక్టరేట్ బిరుదులిచ్చి తమ గౌరవాన్ని మరింత పెంచుకున్నాయి. ఐక్యరాజ్యసమితిలో భారత జాతీయ జాతి కళాగుండెను ఎగరవేసిన తొట్టతొలి కళాకారుడు. ఈ మాట తెలిస్తే ఓరుగల్లు గుండెలు ఎంతగా విప్పారుతాయి. నిజమే! 1932లో వరంగల్ పాత బీటుబజారులో పుట్టిన ఒక సాధారణ వ్యక్తి అంత అసాధారణ స్థాయికి ఎలా వెళ్లగలిగారు. అదొక పాఠం. రాత్రికి రాత్రే కళా సంపన్నుడు అయిపోవాలని ఆయనేమీ కలగనలేదు. అలా కన్న కల నిజం కాదని ఆయనకూ తెలుసు. అందుకే అహోరాత్రులు సాధన చేశాడు. ఆ సాధనే, ఆయన ఆచరణే, ఆయన అనుసరించిన వినయమే, ఆయన పట్టుదలే దేశదేశాలను మెప్పించింది.

బహుముఖ ప్రజ్ఞాశాలి
నేరెళ్ల వేణుమాధవ్ కేవలం మిమిక్రీ కళాకారుడే కాదు.. అంతకన్నా మానవతా విలువలు నిలువునా దట్టించుకున్న సంస్కారవంతుడు. ఆయన పద్యం, నాటకం, పాటలు వంటి రంగస్థల కళల్లోనే కాదు.. బహుముఖీయమైన మానవీయ విలువలున్న మహామనిషి. ఆయన తెలుగు కంటే ఉర్దూనే ఎక్కువగా ఇష్టపడతారు. ఉర్దూ మీడియంలో చదువుకోడంతో ఆయనకు హిందీ అత్యంత సులువైంది. సంస్కృతం, తెలుగు పద్యాలు ఆయనలోని సంస్కారాన్ని మరింత వికసింపజేశాయి. ఇవ్వాళ ఒక కళాకారుడిగానే కాదు, తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మమేకం కావడానికి అవసరమైన అన్నింటి దగ్గరికి వెళ్లి, అవన్నీ ఆయన దగ్గరికే, తన చుట్టూ గింగిరిలు కొట్టేలా విశేష కృషి చేశారు. అన్నింటిపైనా సాధికారతను సొంతం చేసుకున్నారు అని ప్రముక కవి, గాయకుడు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ డాక్టర్ నేరెళ్ల బహుముఖీ ప్రజ్ఞాపాఠవాలను ఆవిష్కరించారు. మిమిక్రీ కళకు ఆధ్యుడు తనే. తనే సిలబస్. ఒక అనుకరణకు కళకు ఆయన ఒవరడి దిద్దారు. మిమిక్రీ అంటే హాస్యపూరితమైనదిగా ఇవ్వాళ సమాజం చూస్తున్నా, దాన్ని నవ్వించే కళగానే డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ చూడలేదు. తనకున్న విశేషమున్న సంగీత, సాహిత్య సాంగత్యం సంస్కారంతో ఓరుగల్లు నుంచి ఎవరెస్టు శిఖర సమానమైన స్థాయికి చేరుకోగలిగారు.

తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య వైతాళిక సాంగత్యం ఆయనకు భూమికను పోషించింది. ఆయనకు ఉర్దూ, హిందీ, తెలుగు రావడంతోనే పృథ్వీరాజ్ కపూర్‌ను ఇమిటేట్ చేయగలిగారు. తమిళం నేర్చుకున్నారు గనుకే కరుణానిధిని, అన్నాధురైని మైమరిపించారు. తనకున్న పాండిత్యం, సంస్కృత అభినివేశంతోనే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను, జవహర్‌లాల్‌నెహ్రూను అనుకరించి అబ్బురపరిచారు. తనకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానంతో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీనీ అనుకరించి ప్రపంచాన్ని అబ్బుపరిచారు. ఇవ్వాళ మిమిక్రీ, లేదా వెంట్రిలాక్విజం చేసే వాళ్లు కేవలం వెకిలిగా, డబుల్ మీనింగ్ డైలాగులతో (అందరు కాదు కొందరు) నవ్విస్తున్నారు అని డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ చెప్పేవారు. సినిమా నటుల్ని ఎవరైనా అనుకరించవచ్చు. కానీ మెకనస్‌గోల్డ్, టెన్ కమాండ్‌మెంట్స్‌ను అనుకరించడం అంటే సాధారణ విషయం కాదు. ఆడియో, వీడియోలు లేని రోజుల్లోనే ఆయన అద్భుతాలు సృష్టించారు. అంటే ఎంత సాధన చేయాలి? ఆ సాధనకు ఎంత కాలాన్ని వెచ్చించాలి? ఎంత ఓపిక కావాలి? వీటన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఎంత పట్టుదల ఉండాలి? ఇలా అన్నింటినీ జయించారు. అన్నీ తనచుట్టూరా గింగిరిలు కొట్టేలా చేసుకున్న శక్తివంతుడు నేరెళ్ల.

221
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...