పకడ్బందీగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్

Sat,November 16, 2019 04:01 AM

- ప్రతి నెల సమావేశమై పురోగతిని నివేదించాలి
- ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి
- తడి, పొడి చెత్త కోసం ఇంటికి రెండు బుట్టలు
- అధికారుల సమీక్షలో కలెక్టర్ శివలింగయ్య

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, నవంబర్ 15: జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో, ఎంపికైన 4 గ్రామాల్లో పకడ్బందీగా సమగ్ర ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ జరుగుటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన జిల్లాలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షించి సమర్థవంతంగా చేయుటకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పా టు చేసి జిల్లాలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, బయోమెడికల్ వేస్త్ తదితర అంశాల అమలుపై ప్రతినెల సమావేశమై మినెట్స్‌ను ప్రభుత్వానికి పంపాలన్నారు. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూరు, మరిపెడ మున్సిపాలిటీలతో పాటు మహబూబాబాద్ మండలంలోని మాధవాపురం, పెద్దవంగర మండలాల్లోని చిట్యాల గ్రామంలో, నెల్లికుదురు మండల కేంద్రం, చిన్నగూడూరు మండల కేంద్రం మొత్తం 4 గ్రామాలను మొదటి విడతలో ఎంపిక చేసి నిబంధనల మేరకు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణ వందశాతం పటిష్టంగా జరగాలన్నారు.

తడి, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు చైతన్యం కల్పించి ప్రతి ఇంటికి 2 చొప్పున చెత్త బుట్టలను అందజేసినట్లు చెప్పారు. అవసరమైన ఆటోలు, రిక్షాలు, రిక్షా కార్మికులకు హ్యాండ్ గ్లౌజ్‌లు, బూట్లు, ఆఫ్రాన్స్ వెంటనే సమకూర్చి ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేయాలని తెలిపారు. చెత్త సేకరణ పటిష్టంగా జరుగుటకు ప్రతి మున్సిపాలిటీకి కొత్త ట్రాక్టర్లు, ఆటోరిక్షాలు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీలతో పాటు ఎంపిక చేసిన 4 గ్రామాల్లో వారంలోగా పూర్తిస్థాయిలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్ యార్డుల ఏర్పాటుకు అన్ని గ్రామాల్లో స్థల సేకరణ చేశారని, వెంటనే చెత్త సేకరణ, ప్రాసెసింగ్, తదితర వాటి నిర్వహణ పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటితో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, వాటి స్థానంలో జ్యూట్, పేపర్ బ్యాగ్స్ ఉపయోగించే విధంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. అందులో భాగంగా ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ ఇచ్చిన ప్రజలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, జిల్లా వైద్యాఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ వెంకటేశ్, మహబూబాబాద్, నెల్లికుదురు, చిన్నగూడూరు, పెద్దవంగర ఎంపీడీవోలు గోవిందరావు, వేణుగోపాల్, వేషి, అపర్ణ, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపల్ కమిషనర్లు రాజేశ్వర్, బాబు, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోల్‌ప్లే పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ అభినందన
కేసముద్రం రూరల్: ఈనెల 8వ తేదీన హైదరాబాద్‌లో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రోల్‌ప్లే పోటీల్లో గెలుపొందిన మండలంలోని కల్వల మోడల్ స్కూల్ విద్యార్థులు తృతీయ స్థానం సాధించడంతో వారిని కలెక్టర్ శివలింగయ్య శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులు సాహితి, యుహిత, శ్రీజ, సంజన, మొహ్మద్‌రీమను కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో ప్రథమ స్థానం సాధించి పతకాలను గెలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, ఎంఈవో శ్రీరాములు, డీఎస్‌వో అప్పారావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపస్, ఉపాధ్యాయులు కవిత, మస్లీవద్దిన్, రవి, జ్యోతి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles