పండుగలా వ్యవసాయం

Wed,November 13, 2019 03:07 AM

రాయపర్తి, నవంబర్‌ 12 : అన్నదాతలను అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ సబ్‌ యార్డులో ఇందిరాక్రాంతి పథకం, మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన కలెక్టర్‌ హరితతో కలసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో అన్నదాతలు పుట్టెడు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు చెప్పారు. ఉద్యమ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడంతో పండుగ వాతావరణంలో రైతులు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ కష్టంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్‌ఎండీ, ఎస్సారెస్పీ జలాలతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ మత్తడి దుంకుతూ.. గంగమ్మ పాతాళం నుంచి పైకి ఉబికి వస్తున్నదని ఆనందం వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన చెప్పారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరానికి మించి ధాన్యం సేకరిస్తున్నట్లు మంత్రి వివరించారు. రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించాలన్న లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలుకు ముందుకు వచ్చినట్లు మంత్రి వివరించారు. కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్కరూ వినియో గించుకోవాలన్నారు.

ప్రభుత్వ పథకాలకు కేంద్ర మంత్రుల ప్రశంస
రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రులలు ఆకర్షితులై ప్రశంసల వర్షం కురిపిస్తున్నట్లు చెప్పారు. సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రభుత్వ పనితీరు, సీఎం కేసీఆర్‌ ఆలోచనా తీరుకు ఫిదా అయి మెచ్చుకున్న ట్లు తెలిపారు. కానీ, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు ప్రభుత్వ పనితీరును గుర్తించకుండా ఊదరగొట్టే ఉపన్యాసాలతో కాలం వెలిబుచ్చుతున్నట్లు ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల సేవలను విస్తృతం చేసేలా కేంద్ర మంత్రులు కృషి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

రైతు సమన్వయ సమితులకు మంచి రోజులు..
సీఎం కేసీఆర్‌ ఆలోచనల్లో నుంచి పురుడుపోసుకున్న రైతు సమన్వయ సమితులకు భవిష్యత్‌లో బంగారు రోజులు రాబోతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే రైతు సమన్వయ సమితులకు దిశానిర్దేశం చేయడంతోపాటు విధులు-నిధులు-బాధ్యతలను నిర్దేశించే అవకాశం ఉందని ఆయన సూత్రప్రాయంగా వివరించారు. రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చి ప్రభుత్వం నిర్దేశించిన గిట్టుబాటు ధర పొందాల్సిందిగా మంత్రి కోరారు. డీఆర్‌డీవో మిట్టపల్లి సంపత్‌రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ గుజ్జుల రవీందర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ అల్లం రాజ్‌కుమార్‌, రాయపర్తి గ్రామ సర్పంచ్‌ గారె నర్సయ్య, ఎంపీటీసీలు బిల్లా రాధిక, అయిత రాంచందర్‌, మండల వ్యవసాయాధికారి గుమ్మడి వీరభధ్రం, ఐపీఎం పులుసు అశోక్‌కుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు మునావత్‌ నర్సింహ్మానాయక్‌, ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఎండీ నయీం, సీసీలు దేవేంద్ర, స్వామినాయక్‌, అనిత, యాదగిరి, భాగ్యలక్ష్మి, నిర్వాహకులు పాలకుర్తి మయూరి, మచ్చ రోజారాణి, తుషాళిక, శోభ, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

డబుల్‌ బెడ్‌ ఇండ్ల సముదాయంలో హరితహారం..
మండల కేంద్ర శివారులోని డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల సముదాయంలో మంత్రి దయాకర్‌రావు.. కలెక్టర్‌ హరితతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు అత్యంత విలువైనవని, వీటిని భవిష్యత్‌లో ప్రభుత్వం వినియోగించుకునేలా కృషి చేస్తుందని వివరించారు. నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడాలని మంత్రి కోరారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles