పోలీస్ పారాహుషార్..!

Mon,November 11, 2019 01:27 AM

-చట్టమెవరికీ చుట్టం కాదు
-కబ్జాదారులకు
సహకారాలు.., అవినీతికి పాల్పడితే అంతే సంగతి
-తాజాగా మట్టెవాడ ఎస్సై దీపక్‌పై సస్పెన్షన్ వేటు

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: చట్టమెవ్వరికీ చుట్టం కాదని మరోసారి రుజువైంది. కంచే చేను మేస్తున్న స్థితిని పోలీస్ కమిషనర్ సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కొంతమంది పాలిట కణకవర్షం కురిపిస్తున్నది. చూసీచూడనట్టు సర్దుకుపోతాం అన్న ధోరణి వల్ల పోలీస్ వ్యవస్థ అబాసుపాలు కాకూడదనే ఉద్దేశంతో చట్టం తన పనితాను చేసుకుంటూ పోతుందని ఇటీవల జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఠాణా లు రచ్చబండలు కాకూడదనే విధానానికి స్వస్తిపలికి బాధితుడికి స్వాంతన చేయాల్సిన పోలీసుల్లో కొందరు అడ్డదారుల్లో అందలం ఎక్కాలని చూస్తున్నారు. బాధితులను బాధుడే ధ్యేయంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫిర్యాదు దారులు ఠాణా మెట్లెక్కాలంటేనే హడలిపోయే వాతావరణం రానున్నది. పోలీస్ స్టేషన్లకు వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు సర్దుకుపోండి అని సూచనలు చేస్తూ సొమ్ము చేసుకునే వైనం పెరిగిపోతుందన్న ఆందోళన, ఆవేదనాభరిత వాతావరణం నెలకొన్నదన్నే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిజాయితీగా పనిచేసే పోలీసు అధికారులకు రివార్డులు ఇస్తూనే తప్పటడుగులు వేసే వారిపై కఠినంగా ఉండకపోతే పోలీసు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని తద్వారా సామాన్య ప్రజలకు న్యాయం అన్యాయమైపోతుందని పోలీ సు పెద్దలు భావిస్తున్నారు. అందుకే అందిన ఆరోపణల ఫిర్యాదులను లోతుగా పరిశీలించి, విచారించి నిజానిజాలను నిగ్గుతేల్చిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎవర్ విక్టోరియస్ పోలీస్ భావిస్తున్నది. అందులో భాగంగానే ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై నిఘా పెంచింది. బయటి శక్తులు తప్పులు చేస్తే చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన తమవాళ్లే తప్పు చేసినా పట్టించుకోకపోతే విశృంఖలత్వానికి దారి తీస్తుందని తద్వారా పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో అసహ్యం కలుగుతుందని భావించిన వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ఆరోపణలు వచ్చిన పోలీసు అధికారులపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి సదరు అధికారులపై వేటు వేస్తున్నారు.

కబ్జారాయుళ్లకు కొమ్ము కాచేవారిపై నిఘా
వరంగల్ మహానగరం విస్తరిస్తున్న కొద్దీ భూమాయ పెరిగిపోయింది. ఆక్రమణలూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఠాణా మెట్లేక్కె ఫిర్యాదుల్లో ఇవే అధికంగా ఉంటున్నాయి. తమ భూమిని ఆక్రమించారు. కబ్జా చేశారు. ఆదుకోండి.. న్యాయం చేయండీ అని బాధితులు పోలీస్ స్టేషన్‌కు వస్తే ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేయకుండా ఆయా పోలీస్ పరిధిల్లో ఉన్న కొంతమంది సెటిల్‌మెంట్ చేసే వాళ్ల దగ్గరికి వెళ్లండీ (ఆ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అదుపాజ్ఞల్లో ఉండేవారు) అంటూ ఉచిత సలహాలివ్వటమే కాకుండా కేసు కడితే ఏమొస్తది పరిష్కారం కావటానికి ఏళ్లుపడుతాయి. వాడూ ఉల్టా నీ మీదే కేసు వేస్తాడు. స్టేషన్ బయట సర్దుబాటు చేసుకోండీ అంటూ సలహాలిచ్చే సంస్కృతి పెరిగిపోయిందనే ఆరోపణలు కోకొల్లలు.

నగరం చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో పనిచేసే కొంతమంది పోలీసు అధికారులైతే సర్దుబాటు కింద తమ బినామీల పేరు మీద స్థల వీలునామాలు రాయించుకుంటున్నారనే ఆరోపణలు గతంలో అనేకం వచ్చాయి. బాధితుల ఫిర్యాదులో నిజముందని తెలిసినా సరే అవతలివారి ప్రలోభాలకు లొంగి అన్యాయానికి గురిచేస్తున్నారనే ఆరోపణలు సైతం లేకపోలేదు. భూ కబ్జాదారులకు అన్ని రకాల సహాయ సహకారాలు మాత్రమే కాదు వారికి రాచమర్యాదుల చేస్తూ వారితో చెట్టాపట్టాల్ వేసుకుంటూ బాజాప్తా దోస్తానా చేస్తున్నారని కొంతమంది పోలీసు అధికారుల మీద ఆరోపణలు అందుతున్నాయంటే పరిస్థితి ఎంత దాకా వెళ్లిందో అర్థం అవుతుంది. అయితే చట్టం ఎవరికీ చుట్టం కాదు ఆధారాలతో సహా నిరూపణ అయితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఇటీవల జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

అవినీతికి పాల్పడే వారిపై..
కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ భూ కబ్జాదారుడికి సహకరించారనే ఆరోపణలు వచ్చినప్పుడు పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ స్వయంగా రంగంలోకి దిగి నిజానిజాలను నిగ్గుతేల్చి సదరు స్టేషన్ సీఐ రాఘవేందర్, ఎస్సై విఠల్‌పై వేటు వేశారు. అయితే నెలన్నరపాటు సస్పెన్షన్‌లో ఉన్న విఠల్‌కు చెన్నారావుపేట స్టేషన్‌లో ఎస్సైగా పోస్టింగ్ ఇచ్చారు. డబ్బువాసన రుచి మరచిపోకుండా తన వెనకటి ప్రవర్తనను మానుకోకుండా పోస్టింగ్ తెచ్చుకొని కనీసం నెలతిరగకుండానే చెన్నారావుపేటలో అవినీతి ఆరోపణలపై విఠల్ మరోసారి సస్పెన్షన్‌కు గురికావడం విశేషం. విఠల్ కమిషనరేట్ పరిధిలో డబుల్ సస్పెండెండ్ ఎస్సైగా పేరు తెచ్చుకోవడం విచారకరమే అయినా చట్టం తన పనితాను చేస్తూ పోతుంది కదా! అని పోలీస్ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు తాజాగా మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై దీపక్‌పై ఇటువంటి ఆరోపణలే ఇటీవల వచ్చాయి.

ఒక పెద్ద మనిషికి దగ్గర కావడం కోసం, అతని చెప్పుడు మాటలు శిరసావహించినందుకు పోలీస్ కమిషనర్ ఆదివారం సస్పెండ్ చేశారు. ఒకరు చెబితే భార్యాభర్తల్ని కిడ్నాప్ చేసిన వ్యక్తికి సహకరించడమే కాకుండా సదరు వ్యక్తి దగ్గరి నుంచి పెద్దమొత్తంతో ముట్టిందనే ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఒకవైపు భూ కబ్జాలకు సహకరించే వారి దగ్గరి నుంచి మరోవైపు ఫిర్యాదు దారుల నుంచి వసూళ్లకు పాల్పడే కళంకిత పోలీసులపై వేటు వేయకపోతే పరిస్థితి మరింత దిగజారే వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీస్ పెద్దలు వారి పట్ల కఠినంగా ఉంటున్నారు. మరోవైపు కమిషనరేట్ పరిధిలో ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు వెడల్పులో జాగ కోల్పోయిన బాధితుడి ఫిర్యాదును పక్కనపెట్టి దొంగలకు సద్దిగట్టిన చందంగా వ్యవహరించిన ఓ సీఐ, మరో ఎస్సైపై విచారణ సాగుతున్నట్టు, వారిపైనా త్వరలోనే కొరఢా ఝుళిపే అవకాశాలు లేకపోలేదని విశ్వసనీయ సమాచారం.

అందరిపైనా నిఘా..
పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్, సెంట్రల్‌జోన్ల పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో వచ్చిన ఫిర్యాదులు, నమోదైన కేసులు, వాటి అనంతర పరిణామాలపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ ప్రత్యేక నిఘా వేసినట్టు తెలుస్తుంది. సాధారణంగా నెలనెలా నిర్వహించే క్రైం మీటింగ్‌లకు గతంలో మాదిరిగా ఈసారి ఎవరో టార్గెట్ అన్నట్టుగా వాతావరణం నెలకొందని పోలీసు అధికారులు అనుమానంతో ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. క్రైం మీటింగ్ మొదలు కాగానే ఆ నిర్దేశిత కాలంలో ఆయా పోలీస్ స్టేషన్లలో మంచి పనులు చేసిన వారిని అభినందించి తర్వాత ఠాణాల వారీగా తనకు తన వేగుల ద్వారా లేదా తనకు వచ్చిన ఫిర్యాదుల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా స్టేషన్ వారీగా ఒక్కొక్కరిని నిలబెట్టి వాటి పర్యవసనాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది.

మొత్తం మీద చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారెంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని, చట్టం ఎవరికీ చుట్టం కాదనే ధోరణితో నగర పోలీస్ కమిషనర్ వ్యవహరిస్తున్నట్టు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నా డు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఫ్రెండ్లీ ఫుల్లింగ్ ఓన్ పాకెట్ కాదని, బాధితులకు న్యాయం చేయడంలో చట్ట పరిధిలో తోడ్పాటును అందించాలన్న స్పృహ అందరిలో ఉండేందుకు, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని కలిగించడమే ధ్యేయంగా అందరూ పనిచేయాలని లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles