రెండు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండాలి

Mon,November 11, 2019 01:24 AM

మహబూబాబాద్ నమస్తే తెలంగాణ, నవంబర్ 10 : వర్షాలు సమృద్ధిగా పడి, పంటలు బాగా పండి రెండు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండేలా చూడాలని భగంవంతుడ్ని ప్రార్థించినట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆదివారం మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో పాటు ప్రజలు బాగుండాలని కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశీర్వదం వల్ల తాను మంత్రి అయిన తర్వాత తొలిసారిగా శ్రీవారిని దర్శించుకున్నానని, అందరూ బాగుండాలని కోరుకునే సీఎం కేసీఆర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. గతంలో రవాణా శాఖ మంత్రిగా కేసీఆర్ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చారని, తెలంగాణ వచ్చిన తర్వాత 16శాతం ఐఆర్, 43శాతం ఫిట్‌మెంట్ కూడా ఇచ్చి ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నారని మంత్రి గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఆర్టీసీతో పాటు చాలా కార్పొరేషన్లు ఉన్నాయని, వాటన్నింటినీ కాదని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ తాము పాలించే ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీని ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. ప్రజల్లో బలంలేని ప్రతిపక్ష పార్టీల మాటలు విని స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్న యూనియన్ నాయకుల మాయలో పడి ఆర్టీసీ కార్మికులు జీవితాలు నష్టపోవద్దని కోరుతున్నారని తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయరెడ్డిపై జరిగిన దాడి అమానుషమని, ఇలాంటి చర్యలకు ప్రజాస్వామ్యంలో తావు లేదన్నారు. దోషులను ప్రభుత్వం శిక్షిస్తుందని, బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాళహస్తి దేవాలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమల తిరుపతి జేఈవో ధర్మారెడ్డి, మంత్రి కుటుంబసభ్యులతో పాటు, నాయకులు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నూకల రంగారెడ్డి, సీహెచ్ నర్సింగరెడ్డి, కొంపెల్లి శ్రీధర్‌రెడ్డి, వల్లూరి క్రిష్ణారెడ్డి, మచ్చ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles