-బాగోగులు చూసేవారు లేక వృద్ధ దంపతుల బలవన్మరణం
-దహన సంస్కారాలు కొడుక్కు భారం కావొద్దని..
-అంగిజేబులో రూ.20వేలు పెట్టుకొని..
-ముహూర్తం చూసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య
మహదేవపూర్, నవంబర్ 08 : ఏడడుగులతో ఒక్కటైన వారి దాంపత్య జీవితం ఆ గ్రామంలో అందరికి ఆదర్శంగా నిలిచింది. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ... ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లాల్సిందే.. వయసు పై బడుతున్న తమ దాంపత్య జీవితంలో ఎలాంటి కలతలు లేకుండా సంతోషంగా గడిపారు. వారికి కుమారుడు, ముగ్గురు కూతుళ్ల సంతానం కాగా పెంచి పెద్దచేసి వివాహాలు జరిపించారు. ఇలా సాఫీగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో వారు ఒకటి తలిస్తే విధి మరోలా తలిచింది. వయసు మీద పడుతుండడంతో ఆరోగ్యం సహకరించకపోగా తమ బాగోగులు చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో మనస్తాపం చెందారు. జీవితం భారమై మరణమే ఇక శరణ్యమై భావించి వృద్ధాప్యంతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఈ విషాదకర ఘటన మండలంలోని ఎలికేశ్వరం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సాలయ్య(76), రాధమ్మ(66) వృద్ధ దంపతులకు కుమారుడు సత్తయ్య, ముగ్గురు కూతుళ్లు సమ్మక్క, అమ్మక్క, తిరుపతమ్మ సంతానం. వివాహం అనంతరం కుమారుడు వేరు కాపురం పెట్టడంతో వారిద్దరే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో వ్యవసాయ పనులు మానేసి ఇంటి వద్దే ఉంటున్నారు. దీంతో ఆరోగ్య పరిస్థితులు వారిని మరింత కుంగదీయగా బాగోగులు చూసే వారే లేరని మనస్తాపంతో ఆత్మహత్యే శరణ్యమని భావించారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ముహూర్తం చూసుకుని ఆత్మహత్య..
కాగా, సాలయ్య, రాధమ్మ దంపతులు ముహూర్తం చూసుకుని ఆత్మహత్యకు పాల్పడడం అందరనీ కంటతడి పెట్టిస్తోంది. కార్తీకమాసం కావడంతో తమ కుటుంబానికి అరిష్టం వాటిల్లే అవకాశముందని భావించిన వారు అందుకోసం శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో మరణిస్తే తమ కుటుంబానికి మంచి జరుగుతుందని భావించారు. అంతేకాకుండా ఒక్కరోజు ముందే పురుగుల మందు డబ్బాతో పాటు నూతన వస్ర్తాలు కొనుగోలు చేసి వాటిని ధరించి మరణించాలనుకున్నారు. అంతేకాకుండా వారి దహన సంస్కార ఖర్చులు తమ కుమారుడికి భారం కాకుండా తమ ఖర్చులతోనే జరగాలని భావించి తమ వద్ద గల రూ.20వేలను షర్ట్ జేబులో ఉంచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు అనుకున్నట్లుగానే శుక్రవారం ఉదయం నూతన వస్ర్తాలు ధరించి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
వృద్ధాప్యంలోనూ అందరితో కలిసిమెలసి ఉంటూ కలివిడిగా మాట్లాడే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆత్మహత్యకు రెండు రోజుల నుంచే గ్రామస్తులందరితో మాట్లాడిన వృద్ధ దంపతులు తీరని లోకానికి చేరడంతో గ్రామస్తులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఎలికేశ్వరం గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.