విద్యార్థినులను సొంత పిల్లల్లా చూసుకోవాలి

Thu,November 7, 2019 02:05 AM

నెల్లికుదురు, నవంబర్ 06: కస్తూర్బా విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉపాధ్యాయినులు తమ సొంతపిల్లల్లా చూసుకోవాలని జాయింట్ కలెక్టర్ డేవిడ్ సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మతో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకెళ్లి విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా ?, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా ?, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్యాన్లు పనిచేయడంలేదని, బయోలాజికల్ టీచర్ పోస్టు ఖాళీగా ఉందని విద్యార్థులు చెప్పడంతో ఫ్యాన్లు పనిచేసేలా చూడాలని, ప్రత్యామ్నాయంగా టీచర్‌ను ఏర్పాటు చేయాలని డీఈవోకు సూచించారు. అనంతరం ఉపాధ్యాయ బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి(ఎస్‌వో), ఉపాధ్యాయినులు సమన్వయంతో పనిచేయడంలేదని తన దృష్టికి వచ్చిందని తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి సూచనల మేరకు కేజీబీవీని సందర్శించానని, జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో సందర్శించనున్నట్లు చెప్పారు.

బాలికల విద్యాలయంలోకి విద్యార్థినుల తల్లిదండ్రులను మినహా ఇంకెవ్వరినీ లోనికి అనుమతించవద్దని, గేట్ వద్ద ఇన్, అవుట్ రికార్డును నిర్వహించాలని, విద్యార్థినులను ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఎవ్వరైతే తీసుకెళ్తున్నారో వారి ఫొటో తీసి పెట్టుకోవాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకై ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలని, ఫలితాల్లో తేడాలోస్తే చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, మండల విద్యాశాఖ అధికారి గుగులోత్ రాము, తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్, కేజీబీవీ ఎస్‌వో సుమలత, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles