వీడిన ఉత్కంఠ...

Sat,October 19, 2019 03:11 AM

-మద్యం షాపులకు డ్రా
-52 షాపులకు వ్యాపారులు ఖరారు
-కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్దతిన ఎంపిక
-ఏపీ వ్యాపారులకు వచ్చిన రెండు మద్యం షాపులు
-ఏబీ ఫంక్షన్‌హాలు వద్ద కోలాహాలం

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకున్న వ్యాపారులకు ఉత్కంఠ వీడింది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏబీ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన డ్రాకు భారీ ఎత్తున దరఖాస్తుదారులు తరలివచ్చారు. ఉదయం 10గంటల నుంచే ఫంక్షన్‌హాలు వద్దకు మద్యం వ్యాపారులు, దరఖాస్తుదారులు చేరుకున్నారు. ముందుగా 1-20 షాపులకు దరఖాస్తులు చేసుకున్న వారిని ఫంక్షన్‌హాలు లోపలికి అనుమతించారు. షాపుల క్రమసంఖ్య ప్రకారం లాటరీపద్దతిలో మద్యం షాపులను ఎంపిక చేశారు. ఫంక్షన్‌హాలుకు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఉదయం 11గంటలకు చేరుకున్నారు.

అనంతరం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ దశరథం మ ద్యం షాపుల సీరియల్ నంబర్ ప్రకారం చదువుతూ, ఒక్కో షాపుకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం వారికి కేటాయించిన సీరియల్ నంబర్‌ను దరఖాస్తుదారులకు చూపించి స్టీల్ డబ్బాలో వేశారు. నంబర్లు ఉన్న కాయిన్లను డబ్బాలో వేశారు. తర్వాత మూత తీసి అందులో ఒక కాయిన్‌ను తీసి దరఖాస్తుదారులకు చూపించారు. ముందుగా 20షాపుల దరఖాస్తుదారులకు సంబంధించిన డ్రా పూర్తవగానే మరో 20మద్యం షాపులకు దరఖాస్తుదారులను లోపలికి పంపించారు. చివరికి మరో 12 షాపుల దరఖాస్తుదారులను పంపించారు. లాటరీ పద్దతిలో ఎంపిక చేసిన వ్యాపారులను వెంటనే వేదికపైకి పిలిచి సంతకం తీసుకున్నారు. అదే విధంగా లైసెన్సు ఫీజులో ఎనిమిదో వంతు సొమ్మును డిపాజిట్ చేయించారు.

జిల్లా వ్యాప్తంగా 52 షాపులకు 1531 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో మూడు స్టేషన్ల పరిధిలో మహబూబాబాద్ స్టేషన్ పరిధిలో మొత్తం 24 షాపులకు 693, తొర్రూరు పరిధిలోని స్టేషన్‌లో 19 మద్యం షాపులకు 561 దరఖాస్తులు, గూడురు స్టేషన్ పరిధిలోని 9షాపులకు 277 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 52 మద్యం షాపులకు 1531 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా లో అత్యధికంగా కురవిలో 18 షాపులకు 67 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా మహబూబాబాద్ పట్టణంలోని 7,9,12 షాపులకు ఒక్కో షాపుకు 14 దరఖాస్తులు వచ్చాయి. రెండో స్థానంలో బయ్యారం మండలం జగ్గుతండాలోని 47షాపుకు 57 దరఖాస్తులు దాఖలయ్యాయి. డ్రా సందర్భంగా పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ సిబ్బంది భద్రత నిర్వహించారు. ఉదయం 10గంటలకే దరఖాస్తుదారులు వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ ఫ్రాంగణం మొ త్తం వ్యాపారులతో సందడిగా మారింది. మొత్తం మీద డ్రా ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా పూర్తి కావడంతో అధికారులు ఊపరి పీల్చుకున్నారు.

ఏపీ వ్యాపారులను వరించిన అదృష్టం
జిల్లాలో 52 షాపులకు ఈనెల 9నుంచి 16వరకు దరఖాస్తులు స్వీకరించారు. కాగా ఏపీలోని శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన సుమారు 40మంది వ్యాపారులు జిల్లాలోని వివిధ షాపులకు దరఖాస్తులు చేశారు. ఏపీలో అక్కడి ప్రభుత్వం మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో ఈసారి అక్కడి వ్యాపారులు తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తులు చేశారు. జిల్లా వ్యాప్తంగా 52షాపులకు 10 షాపులు ఇతరులకు దక్కాయి. ఇందులో ఇద్దరు ఏపీ వ్యాపారులు కాగా, మరో 8మంది ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన వారిని వరించాయి. మిగతా 42 షాపులు లక్కీ డ్రాలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన వారిని వరించాయి.

10 షాపులు ఇతరులకు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 52షాపుల్లో ఇతరులకు 10 షాపులు దక్కాయి. ఇందులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వారు ఉండగా, మరో 8మంది ఇతర జిల్లాలకు చెందిన వారు. డోర్నకల్ మండలంలో 2వ షాపు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వీరగట్టం మండలం రేగులపాడు గ్రామానికి చెందిన పరిశాల వెంకటరమణకు లక్కీ డ్రా తగిలింది. కురవి మండలంలో 2వషాపును విశాఖపట్నం జిల్లా తాటిచెర్లపాలెంకు చెందిన నెల్లి మీనబాబుకు దక్కింది. ఇవి కాకుండా మరో 8మద్యం షాపులు మన రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారికి దక్కాయి.

మొదలైన భేరసారాలు..
మద్యం షాపులను ఇప్పటికే దక్కించుకున్న వారితో షాపులు దక్కని మద్యం వ్యాపారులు ఇప్పటికే బేరసారాలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కురవి, బ య్యారం మండలంలో ఉన్న మద్యం షాపులతో పాటు మహబూబాబాద్ పట్టణంలో ఉన్న పలు షాపులకు భారీగా డిమాండ్ ఉంది. గత సంవత్సరం ఒక్కో వ్యాపారి నాలుగైదు షాపులు దక్కించుకొని మద్యం వ్యాపారం నిర్వహించారు. ఈసారీ పాత మద్యం వ్యాపారులకు ఎవరికి దాదాపుగా షాపులు దక్కలేదు. కొత్తగా మద్యం వ్యాపా రం అవగాహన లేని వారికి కొన్ని షాపులు వచ్చాయి. దీంతో అతడి పేరు మీదనే షాపు ఉన్నా.. వాటిని నడిపేందుకు ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో షాపులను కొనేందుకు బేరసారాలు ప్రారంభించారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles