దరఖాస్తుల వెల్లువ..

Wed,October 16, 2019 02:39 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 52 షాపులకు జిల్లా ఎక్సైజ్ అధికారులు ఈ నెల 9 నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. బుధవారంతో దరఖాస్తుల గడువు ముగియనుంది. చివరి రోజున అప్లికేషన్‌లు అత్యధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలోకి వచ్చిన వారికి టోకెన్లు కేటాయించనున్నారు. సాయంత్రం 4గంటలు దాటితే దరఖాస్తులను స్వీకరించేది లేదని జిల్లా ఎక్సైజ్ అధికారులు తేల్చి చెప్తున్నారు. ఈనెల 12 వరకు 106 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 14న ఒక్క రోజే 279 అర్జీలు వచ్చాయి. దీంతో వీటి సంఖ్య 385కు చేరగా, మంగళవారం వచ్చిన 365 దరఖాస్తులతో 750కి చేరింది. బుధవారం భారీ ఎత్తున అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం జిల్లా ఎక్సైజ్ అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్, తొర్రూరు, గూడైరు ఎక్సైజ్ స్టేషన్ల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొత్తం 1813 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సారి అందుకు భిన్నంగా పురుషులతో పాటు మహిళల పేర్లపై ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. బుధవారం దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తరువాత ఈ నెల 18న శనిగపురం రోడ్‌లోని ఏబీ ఫంక్షన్ హాలులో లాటరీ పద్దతి ద్వా రా షాపులను కేటాయించనున్నారు. కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

పోటా పోటీగా దరఖాస్తులు
వ్యాపారులు మద్యం షాపులను దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు. 52 షాపులకు మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 750 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎక్సైజ్ స్టేషన్ల వారీగా వివరాలను పరిశీలిస్తే మహబూబాబాద్-333, తొర్రూరు-269, గూడూరు-148 దరఖాస్తులు వచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కనీసం వంద దరఖాస్తులు కూడా రాలేదు. 2.30గంటల తర్వాత వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అధికారులు సాయంత్రం 6:30 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు.

మహిళల పేరుతో అర్జీలు..
మద్యం వ్యాపారులు ఈసారీ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. పురుషుల పేరుతో దరఖాస్తు చేస్తే కలిసి వస్తుందో లేదో అనే అనుమానంతో మహిళల పేరుపై టెండర్లు వేస్తున్నారు. ఒక మద్యం షాపుకు ఒకరే దరఖాస్తు చేయాలనే నిబంధన ఉండటంతో ఎక్కువ సంఖ్యలో మహిళలు అప్లికేషన్లు ఇస్తున్నారు. తొర్రూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా మహిళల పేరుతో దరఖాస్తులు వచ్చాయి. బుధవారం దరఖాస్తుదారుల సంఖ్య మరింత పేరిగే అవకాశం ఉంది. కొంతమంది వ్యాపారులు తమ కుటుంబ సభ్యుల్లో ఉన్న మహిళల పేర్లతో వేస్తే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

దరఖాస్తులకు నేడు తుదిగడువు -దశరథం, ఎక్సైజ్ సూపరింటెండెంట్
బుధవారం దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు. ఉద యం 10నుంచి సాయంత్రం 4గంటల లోపు వచ్చిన దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తాం. 18న జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఏబీ ఫంక్షన్ హాలులో లాటరీ పద్దతి ద్వారా షాపుల ఎంపిక చేస్తాం. గత సారితో పోలిస్తే ఈ ఏడాది మహిళలు దరఖాస్తులు చేసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. జిల్లాలో ఉన్న 52 షాపులకు జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సమక్షంలో డ్రా తీస్తాం.

96
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles