పిడుగుపాటుతో తండ్రీకొడుకు మృతి

Wed,October 16, 2019 02:36 AM

మరిపెడ నమస్తేతెలంగాణ, అక్టోబర్ 15: పిడుగుపాటుకు తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన మరిపెడ మండలం తానంచర్ల శివారు వాల్యతండా గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. రెప్పపాటులోనే మృత్వువు నుంచి మృతుడి భార్య బతికి బయట పడ్డది. వివరాల్లోకి వెళ్తే తండాకు చెందిన తేజావత్ కిషన్ (48), ఆయన భార్య తార ఉదయం పత్తి తీయడానికి వెళ్లారు. మధ్యాహ్నం వీరి కొడుకు సంతోశ్(14) వారిద్దరికి అన్నం తీసుకుని చేనువద్దకు వెళ్లాడు. తర్వాత తల్లిదండ్రులతో కలిసి సంతోశ్ కూడా పత్తి తీసే పనిలో నిమగ్నం అయ్యాడు. ఇంతలోనే కారు మబ్బులు కమ్మేసి, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కోసిన పత్తి తడవకుండా పెట్టడానికి కిషన్ భార్య తార చెట్టు కిందికి తీసుకెళ్లింది. తండ్రి కొడుకులు టార్పాలిన్ కవర్లు కప్పుకొని పత్తి తీస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరికి సమీపంలోనే పిడుగు పడగా అక్కడికి అక్కడే మృతి చెందారు. కళ్ల ముందే భర్త, కుమారుడు మృతి చెందడం చూసి భార్య సృహ కోల్పోయింది. సమీప చేన్ల వద్ద ఉన్న వాళ్లు గమనించి తండా వాసులకు సమాచారం ఇవ్వడంతో అందరు అక్కడి చేరుకొని మృతులను ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబానికి ఆసరాగా ఉండే కిషన్, తండా వాసులతో తిరిగే సంతోశ్ మృతి చెందడంతో వాల్యతండా వాసులు శోకసముద్రంలో మునిగి పోయారు. భార్య తార, తల్లి పాప్లి, బిడ్డ శిరీష గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలిసిన తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య, తహసీల్దార్ సైదులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. స్థానిక సీఐ ఎం కరుణాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సంతోశ్ వద్ద సెల్ ఫోన్ ఉండడంతోనే పిడుగు పడి ఉండొచ్చునని తండా వాసులు భావిస్తున్నారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం నుంచి త్వరగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నవీన్, యువ నేత డీఎస్ రవిచంద్ర వేర్వేరుగా అధికారులను ఆదేశించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. తండావాసుల నుంచి జరిగిన ఘోరాన్ని తెలుసుకొని సంతాపం తెలిపారు. స్థానిక తానంచర్ల, వాల్యతండా సర్పంచ్‌లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles