అదనపు వసూళ్లకు అడ్డుకట్ట

Wed,October 16, 2019 02:35 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 15: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించి ప్రజలకు రవాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే తాత్కాలిక కండక్టర్లుగా పని చేస్తున్న కొందరు ప్రయాణికుల నుంచి రవాణ భత్యానికి మించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసేలా అధికారులు పకడ్బందీ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులకు టిక్కెట్ల జారీ పరిశీలన కోసం, ఆర్టీసీకి నష్టం వాటిళ్లకుండా రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ శివలింగయ్య ఆదేశాల మేరకు మహబూబాబాద్, తొర్రూరు ఆర్డీవోలు కొమురయ్య, ఈశ్వరయ్య, వీఆర్వో, వీఆర్‌ఏలతోపాటు పంచాయతీ కార్యదర్శులను రంగంలోకి దించారు. మానుకోట డిపో పరిధిలో 60 మంది వీఆర్వో, వీఆర్‌ఏలు, తొర్రూరు డిపో పరిధిలో 37 మంది వీఆర్వో, వీఆర్‌ఏలు, 61 పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి బుధవారం నుంచి ఈ నెలాఖరు 31 వరకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా టికెట్ల జారీ కోసం ముగ్గురు క్లర్క్‌లు తాత్కాలిక విధుల్లో చేరారు. వీరు మానుకోట డిపో పరిధిలో ఐదు బస్సులకు టికెట్లు జారీ చేశారు. అలాగే తొర్రూరు డిపో పరిధిలోని ఐదు బస్సులకు టిమ్ మిషన్ల ద్వారా టికెట్ల జారీ జరిగినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం తొర్రూరు, నెల్లికుదురు, దంతాలపల్లి, పెద్దవంగర మండలాలకు చెందిన 37 మంది వీఆర్వోలు, వీఆర్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు బస్సుల్లో వెళ్లి ప్రయాణికులకు టిక్కెట్ల జారీని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతీ బస్‌కు ఒక పంచాయతీ కార్యదర్శి లేదా రెవెన్యూ ఉద్యోగి ఇక నుంచి పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. వీరంతా రెండు బృందాలుగా విడిపోయి, బస్సుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తమకు అప్పగించిన విధులు నిర్వహిస్తారు. దీనిపై సమగ్ర ఉత్తర్వులను జారీ చేశారు. కాగా మహబూబాబాద్ డిపోకు చెందిన 46 ఆర్టీసీ, 14 ప్రైవేట్ బస్సులు, తొర్రూరు డిపో నుంచి 51 ఆర్టీసీ, 21 అద్దె బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. మంగళవారం తొర్రూరు, నెల్లికుదురు, దంతాలపల్లి, పెద్దవంగర మండలాలతోపాటు పలు మండలాలకు చెందిన వీఆర్వోలు, వీఆర్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఎంఆర్‌ఐ స్థాయి అధికారులు సైతం బస్సుల్లో ప్రయాణికుల నుంచి రవాణా భత్యం వసూళ్ల తీరుపై పరిశీలన చేశారు. తొర్రూరు మండలం నుంచి 17 మంది, దంతాలపల్లి నుంచి ఆరుగురు, నెల్లికుదురు నుంచి తొమ్మిది మంది, పెద్దవంగర మండలానికి చెందిన 5 గురు కలిపి మొత్తం 37 మంది రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు వివిధ బస్సుల్లో టిక్కెట్ల జారీపై పరిశీలన చేశారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles