ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి

Tue,October 15, 2019 03:32 AM

మహబుబాబాద్,నమస్తేతెలంగాణ, అక్టోబర్14:ప్రజావాణిలో ప్రజలు అందజేసిన ఫిర్యాదులను పరిశీలించి, వారి సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం వరకు ప్రజల సమస్యలు వింటూ వారు అందజేసిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. మొత్తం 80 దరకాస్తులు రాగా వాటిలో అత్యధికంగా పింఛన్, కార్పొరేషన్ లోన్స్, భూసమస్యలపై అభ్యర్థనలు ఉన్నాయి. వాటికి ఆయా శాఖల అధికారులు త్వరగా పరిష్కారం చూపాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ, మండల ప్రత్యేకాధికారులు ప్రతి వారం గ్రామాలను సందర్శించాలన్నారు. నర్సరీలు, క్రిమిటోరియా, డంపింగ్‌యార్డ్స్, స్మృతివనాల పనులు నెలాఖరులోగా పూర్తిచేసేలా చూడాలన్నారు. నర్సరీలకు ఫెన్సింగ్, బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కేసముద్రం మార్కెట్‌యార్డులో ఏటీఎం ఏర్పాటు చేయాలని, సర్వేనెంబర్ లేని ప్రభుత్వ భూములకు నెంబర్లు కేటాయించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఖేల్ ఇండియాలో భాగంగా జిల్లాకు మినీస్టేడియం మంజూరైన నేపథ్యంలో పదెకరాల భూమి కేటాయించనున్నట్లు తెలిపారు. గ్రామ కమిటీలు, పాఠశాలల్లో పూర్వ విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ల జాబితా సిద్ధం చేయడంతో పాటు కమిటీలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సకాలంలో బిల్లులు వసూలు చేయని పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న మరుగుడొడ్ల నిర్మాణాలు వందశాతం పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకోని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేయాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు గ్రామపంచాయతీలు బాధ్యత వహించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో లు కొమురయ్య ఈశ్వరయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles