ఆపన్నహస్తం అందించరూ..!

Tue,October 15, 2019 03:31 AM

పోచమ్మమైదాన్, అక్టోబర్ 14: అసలే నిరుపేద కుటుంబం.. ఆపై అనారోగ్య సమస్యలు.. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. కానీ, ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ప్రస్తుతం వారు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. తొర్రూరు ప్రాంతానికి చెందిన మందుల ఉప్పలయ్య, సుజాత దంపతులు తమ కూతురు భవానీతో కలిసి కొత్తవాడలోని ఓ రేకుల షెడ్డులో అద్దెకు ఉంటున్నారు. ఉప్పలయ్య నూతన ఇంటి నిర్మాణాల వద్ద కాపలాదారుడిగా, ఇతడి భార్య సుజాత ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తున్నారు.

మొదటి కాన్పు సమయంలో పుట్టిన కుమారుడు గుండె సంబంధిత సమస్యతో మృతి చెందాడు. తర్వాత వీరికి కూతురు జన్మించింది. కొంతకాలం క్రితం సుజాత అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యుడు సుజాత రెండు కిడ్నీలు పాడైపోయాయని, ఆపరేషన్ చేయాలని సూచించాడు. దీంతో భార్యాభర్తలు కన్నీరుమున్నీరుగా విలపించారు.

అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో రెండు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకుంటున్నారు. అక్కడ ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో వారు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో రెండు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయిస్తున్నారు. డయాలసిస్‌తో పాటు మందులకు వారానికి రూ.50వేల ఖర్చు అవుతుందని భర్త ఉప్పలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే చేసిన అప్పు చెల్లించలేక, మంచంపై ఉన్న భార్యకు వైద్యం చేయించలేక రోజు రోజూ భార్య పరిస్థితి చూస్తూ విలపిస్తున్నాడు. దయార్థ హృదయులు ఎవరైనా ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. దాతలు బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ శాఖ(గోపాలస్వామి గుడిరోడ్డు) అకౌంట్ నెంబర్ 868010110019705లో జమచేయాలని అర్థిస్తున్నారు. వివరాలకు సెల్‌నెంబర్ 9177028487 సంప్రదించాలని కోరారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles