ప్లాస్టిక్ పై యుద్ధం..

Mon,October 14, 2019 04:04 AM

-జిల్లాలో యథేచ్ఛగా పాలిథిన్ వాడకం
-కలుషితమవుతున్న పర్యావరణం
- నిషేధించనున్న తెలంగాణ సర్కారు
-ప్రజలను చైతన్య పరుస్తున్న అధికారులు
-హర్షం వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు

బయ్యారం, అక్టోబర్ 11: ప్లాస్టిక్ కవర్లు మట్టిలో కలిసిపోయేందుకు చాలా సంవత్సరాలు పడుతుందని ఓ వైపు శాస్తవేతలు, మరో వైపు ప్లాస్టిక్ సంచుల వినియోగం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నా వాటి వినియోగం తగ్గడం లేదు. ప్రజలు అవగాహన రాహిత్యం వల్ల ప్లాస్టిక్ వాడకాన్ని కొనసాగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం 2012లో నిషేధం విధించగా సుప్రీం కోర్టు కొన్ని మార్గ దర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం 40 మైక్రాన్ల కంటే తక్కవ మందం కలిగిన కవర్లను వాడకూడదు. నిబంధనలు పాటించని వ్యాపారులపై భారీ జరిమానాలు విధించాలని కూడా ఆదేశాలు జారీచేసింది. దీనితో ప్లాస్టిక్ కవర్లు వాడే వ్యాపారులకు 500 రూపాయల జరిమానా, తయరుచేసే వారికి 50 వేల రూపాయల వరకు జరిమాన విధించాలి. కాని ఈ నిబంధనలను వ్యాపారులు పాటించిన దాఖలాలు లేవు. దీంతో జిల్లాలోని వ్యాపారసముదాయాల్లో వీటిని యథేచ్చగా విక్రయిస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించటంతో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. అయితే పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను నిషేధించి పూర్తిగా కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. గురువారం ప్రగతి భవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకం నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అందుకు కావాల్సిన విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రకటనపై పర్యవరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడకం
ఉదయం లేచిన మొదలు కాఫీ కప్పుతో మొదలయిన ప్లాస్టిక్ వడకం రాత్రి వరకూ కొనసాగుతుంది. ఇంట్లోకి సరకులు తీసుకురావటానికి వెళ్లినప్పుడు సంచులు తీసుకువెళ్లే రోజులు పోయాయి. ఏ చిన్న వస్తువు కొన్నప్పటికీ విక్రయ దారులు ఇచ్చే కవర్లలో తీసుకువచ్చేందుకు ప్రజలు అలవాటు పడ్డారు. హోటళ్లు, కూరగాయల మార్కెట్లు, పండ్ల వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, ఎలక్ట్రికల్, స్వీట్ షాపులు తదితర వ్యాపారులు బహిరంగానే కవర్ల వాడకాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కిరాణం, పాన్‌షాపుల ఎదుట ప్లాస్టిక్ కవర్లను బహిరంగంగానే వేలాడదీసి అమ్ముతున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని, నిషేధాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీలు, పట్టణాల్లో కమిషనర్, గ్రామపంచాయతీల స్థ్దాయిలో సర్పంచ్, కార్యదర్శులపై ఉంది. వీరు పట్టించుకోకపోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రజల ఆరోగ్యంపై పెను ప్రమాదం
ప్లాస్టిక్ కవర్లలో తినుబండారాలు తీసుకువెళ్లడంతో ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. వేడిగా ఉండే చాయ్, సాంబారు, బిర్యాని వంటి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో తీసుక రావటం వల్ల వాటిలో ఉండే పాలివినైక్ రసాయనం, డయక్సిన్ వంటి పదార్థ్దాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనితో మనుషులకు రోగాలతో పాటు జన్యులోపాలు, హర్మోన్ల అసమతుల్యత, కాలేయవ్యాధులు వంటివి తలెత్తుతాయి. అంతేకాకుండా వాటి వ్యర్థాలను కాల్చుతున్న సమయంలో ఆ పొగ ఊపిరితిత్తుల్లోకి చేరి అనారోగ్యా ల పాలయ్యే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ వాడ కం అతిగా చేయటం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు కూడా వ్యాప్తి చెందే ఆవకాశం ఉంది.

దెబ్బతింటున్న పర్యావరణం
ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ప్లాస్టిక్ కవర్లు భూమి లోపల పోరల్లో మట్టిలో పూర్తిగా కలిసిపోవటానికి వందల సంవత్సరాల సమయం పడుతుంది. దీంతో వర్షాలు పడ్డ సమయంలో వర్షపు నీరు సరిగ్గ భూమిలోకి ఇంకదు. తద్వార భూగర్భజలాలు ఆడుగంటి నీటి సమస్య ఏర్పడే ప్రమాదం కూడ ఉంది. వాటిని విచ్చలవిడిగా పడేయడం వల్ల చెట్లు కూడ మొలకెత్తని పరిస్థితి ఏర్పడుతుంది. ప్లాస్టిక్ వస్తువుల్లో కొన్ని రీ సైకిలింగ్ చేయలేనివి వుంటాయి. వీటి వల్ల పర్యావరణంలో ఎన్నో అనర్థాలు తలెత్తుతాయి. అలాగే పాడైపోయిన ఆహార పదార్థాలను వాటిల్లో ఉంచి పడేసినప్పుడు అవి పశువులు, గొర్రెల వంటివి తిని మరణిస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక అనార్థాలు వస్తాయని తెలిసినా పూర్తి స్థాయి అవగాహన లోపంతో ప్రజలు వాటిని వాడుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో పర్యావరణ వేత్తల్లో హర్షం
రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని అమలు చేయాలనే ప్రభుత్వం నిర్ణయంపై పర్యావరణ వేత్తల్లో హర్షం వ్యక్త మౌతుంది. పర్యావరణంపై ప్రభావం చూపి వర్షాలు కురవక, ఉష్ణోగ్రత పెరిగి ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకంతో పాటు ఉత్పత్తిని కూడా నిషేధించేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. దీనిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్త మౌతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ చర్యలతో ప్లాస్టిక్ వాడ కం తగ్గితే భవిష్యత్ తరాలకు కూడా ప్రమాదం వాటిల్లకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని ఇవ్వగలుగుతామని పలువురు భావిస్తున్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles