ఇక టికెట్‌ ప్రయాణం

Sun,October 13, 2019 01:47 AM

సుబేదారి, అక్టోబర్‌ 11: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సులు పరుగులు తీస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రయా ణం సాఫీగా సాగుతోంది. సమ్మె ప్రారంభంలో ఇబ్బందులు తలెత్తినా.., రోజురోజుకూ సమస్యలను అధిగమిస్తూ బస్సు సర్వీసులను పెంచుతూ భేష్‌ అనిపించుకుంటున్నారు. ప్రైవేటు కండక్టర్లు వసూళ్ల పర్వం మొదలు పెట్టారనే ఫిర్యాదుల మేరకు..టికెట్‌ పద్ధతిని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈమేరకు శనివారం 24 బస్సుల్లో టికెట్లు ఇచ్చి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ఈ ప్రక్రియను అన్ని సర్వీసుల్లో అందుబాటులోకి తేవడానికి ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వరంగల్‌-1, 2, హన్మకొండ, పరకాల, భూపాలపల్లి, తొర్రూరు, మహబూబాబాద్‌, జనగామ, నర్సంపేట డిపోలకు చెందిన బస్సులతో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రోజురోజుకూ బస్సుల సంఖ్యను డిపో, రీజియన్‌ అధికారులు పెంచుతూ రద్దీ ఉన్న రూట్లలో అదనంగా నడుపుతున్నారు. బస్‌స్టేషన్లలో అధికారులు, పోలీసులు మకాం వేసి బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, కాళేశ్వరం, ఖమ్మం, సిద్దిపేట, బెంగళూర్‌, తిరుపతి, గుంటూరు, అమరావతి, కడప, విశాఖపట్నం,శిరిడీ, తదితర దూరప్రాంతాలకు సైతం అధికారులు బస్సులను నడిపిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న హన్మకొండ బస్‌స్టేషన్‌లో అధికారులు ఎప్పటికప్పుడు బస్‌లను పంపిస్తున్నారు. సమ్మె ఎనిమిదో రోజున కూడా ఆర్టీసీ ప్రత్యామ్నాయ సేవలతో ప్రయాణాలు సాఫీగా సాగాయి.

టికెట్లతో ప్రయాణం..
సమ్మె ప్రారంభం నుంచి వారం రోజులపాటుగా టికెట్‌ లేకుండానే ఆర్టీసీ రూట్లు, స్టేజీల వారీగా ప్రైవేటు కండక్టర్లు ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకున్నారు. ఈ పద్ధతి వల్ల కొంతమంది ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. పైగా రోజువారీగా ఆర్టీసీకి చెల్లించనున్న డబ్బుల్లోనూ తేడా వస్తున్నట్లు తేలడం, ఆదాయం విషయంలో లెక్కలు చూపకపోవడంతో సంస్థకు మరింత నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై టికెట్‌ పద్ధతిని అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. వరంగల్‌ రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో ఇక నుంచి ఈవిధానాన్ని అమల్లోకి తేనున్నారు. సమ్మె ప్రారంభమైన వారం రోజుల్లో రూ.10 నుంచి, రూ.20లక్షల ఆదాయం వరంగల్‌ రీజియన్‌కు వస్తుంది. టికెట్‌ పద్ధతి అవలంబిస్తే ఆదాయం మరింత పెరగనుంది.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles