హీరో ప్రభాస్ రావాలంటూ..సెల్‌టవర్ ఎక్కిన యువకుడు

Thu,September 12, 2019 02:58 AM

జనగామ టౌన్ : ప్రముఖ సినీ హీరో ప్రభాస్ జనగామకు రావాలని ఓ యువకుడు సెల్ టవర్‌పైకి ఎక్కి బహుబలి సీన్స్‌తో హల్‌చల్ చేసిన సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జనగామ పోలీసుల కథనం ప్రకారం.. గూడూరు మండలం గూడెంగ పాపయ్యతండాకు చెందిన యువకుడు గుగులోత్ వెంకన్న ఉదయం 8 గంటల సమయంలో జనగామ పట్టణంలోని హన్మకొండ రోడ్డులో ఉన్న ఓ సెల్‌టవర్ పైకి ఎక్కి హీరో ప్రభాస్ తనను కలవాలని, ప్రభాస్ వచ్చే వరకు దిగనని పైనుంచి కిందకు దూకుతానని భయబ్రాంతులకు గురిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని టవర్‌పై ఉన్న వెంకన్నను కిందకు దింపేందుకు యత్నించగా ఎంతకూ కిందకు దిగలేదు. విషయాన్ని డీసీపీ శ్రీనివాసరెడ్డికి తెలుపగా డీసీపీ వెంటనే ఫైర్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు సమాచారం అందించి, వెంటనే టవర్ వద్ద వలలను ఏర్పాటు చేసి యువకుడిని కిందకు దింపాలని ఆదేశించారు.

ఈ మేరకు వారు టవర్‌వద్ద వలలను ఏర్పాటుచేసి యువకుడు కిందకు దిగేందుకు నానా తిప్పలు పడ్డారు. అయినా ఆ యువకుడు ఎవరిమాట వినకుండా టవర్ పరికరాలను ధ్వంసం చేస్తూ సైకో మాదిరిగా సినిమాలోని సన్నివేశాలను టవర్‌పై ప్రదర్శిస్తూ ప్రభాస్ రావాలని డిమాండ్ చేశాడు. ఎండవేడి ఎక్కువగా ఉండడంతో ఆ యువకుడు నిదానంగా పోలీసులు సూచనల ప్రకారం కిందకు దిగాడు. కిందకు దిగిన వ్యక్తికి జిల్లా వైద్యాధికారి మహేందర్ సమక్షంలో డాక్టర్ రఘు, సుగుణాకర్‌రాజు జిల్లా దవాఖానలో వైద్య చికిత్సల అనంతరం పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన కంటే ముందు రోడ్డుపై లారీలు, బస్సులు ఆపుతూ వాహనదారులను భయాందోళనకు గురి చేశాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles