18 ఎకరాల్లో 300 పడకల ఆసుపత్రి

Thu,September 12, 2019 02:57 AM

మహబుబాబాద్,నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 11:విషజ్వరాలు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బిందు జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు బానోతు శంకర్ నాయక్, డీఎస్ రెడ్యానాయక్, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు. ప్రభుత్వ దవాఖానలోని డయాలసిస్, జనరల్ వార్డు, ఐసీసీయూ, ఎన్‌బీఎస్‌యూ(నవ జాత శివు చికిత్సా కేంద్రం) ను మంత్రి సందర్శించి రోగులను ఆత్మీయంగా పలుకరించారు. దవఖానలో ఉన్న సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా వైద్యరంగానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. రోగులు ప్రజలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. విషజ్వరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలో గిరిజనులు అధికంగా ఉన్నారని పరిశుభ్రత పాటించక పోవడం వల్ల విషజ్వరాలు ప్రబలుతున్నాయని అన్నారు. ప్రస్తుతం 98 శాతం వైరస్ జ్వరాలు ఉన్నాయని చెప్పారు.

రోగులు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయోద్దని చెప్పారు. జిల్లా ఆసుపత్రులలో మందుల కొరత లేదని అన్ని జబ్బులకు మందులతో పాటు వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పడికే ఉన్న 100 పడకల దవాఖానలో 250 మందికి వైద్యసేవలు అందిస్తున్నారని తెలిపారు. డయాలసిస్ యంత్రాలతో రోజుకు ఎంతమందికి ఎన్నిగంటలు డయాలసిస్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. దవాఖాన సిబ్బంది ఎవరు సెలవులు పెట్టకుండా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అవసరమైతే టెక్నికల్ సపోర్టు తీసుకొని రోగులకు అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. వైద్యపరంగా నిధులకు కొరతలేదని అవసరమైనన్నీ నిధులు వైద్యరంగానికి ఖర్చుచేస్తామని తెలిపారు. అందుకోసం ప్రభుత్వం వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నారని చెప్పారు. వైద్య విద్యను సమాన్య ప్రజల ముంగిట్లోకి తీసుకువచ్చేందుకు అన్ని జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. త్వరలోజిల్లా కేంద్రంలో 18 ఎకరాలలో 100 కోట్ల రూపాయలతో300 పడకల జిల్లా ఆసుపత్రిని నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ డైరెక్టర్, శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీరాం,ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్ భీం సాగర్, ప్రభుత్వ డాక్టర్‌లు పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles