తెలంగాణ అగ్ని కణం చాకలి ఐలమ్మ

Tue,September 10, 2019 02:32 AM

- దొరల గుండెల్లో గుబులు పుట్టించిన ధీర వనిత
- సాయుధ పోరాటానికి దిక్సూచి
- నేడు ఐలమ్మ 34వ వర్ధంతి సభ


పాలకుర్తి : ఆమె అమరగీతం.. మెరిసే ఎర్రటి విప్లవ జ్యోతి.. పోరుబాట పట్టించిన విప్లవనారి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరవనిత. ఆమే చాకలి ఐలమ్మ.. అలియాస్ చిట్యాల ఐలమ్మ. ఎర్రని పూదోటలో ఐలమ్మ ఓ అగ్నికణం. తెలంగాణ సాయుధపోరాటం గురించి ఎవరు ఎక్కడ మాట్లాడుకున్నా ముందుగా గుర్తొచ్చేది చాకలి ఐలమ్మ. ఈ సాయుధ పోరాటానికి నాంది పలకడానికి ఆమె భూసమస్యే వేదికైంది. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించిన నారి ఆమె. దొరల పెత్తన్నాన్ని కొంగు నడుం బిగించి ఎదురించిన వనిత ఐలమ్మ. ఐలమ్మ 1895లో రాయపర్తి మండలం కిష్టాపురంలో జన్మించింది. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యను వివాహం చేసుకుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తినిచ్చింది ఐలమ్మ. ఉద్యమం గురించి తెలుసుకునేముందు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న సాంఘీక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు రైతాంగ సాయుధ పోరాటానికి ఏవిధంగా ఉత్ప్రేరకమయ్యాయో తెలుసుకోవాల్సిన అవసరముంది. 1948 ప్రాంతంలో ఆసఫ్జాహి వంశ పరిపాలనా కాలంలోని చివరి దశలో అధికారం, అహంకారం పరస్పరం పెనవేసుకున్నాయి. ప్రజల కనీస అవసరాలను కాలదన్ని పౌరహక్కులను పాతరేసి జనాలను అణగదొక్కిన కాలమది.

స్వాతంత్రోద్యమం ముగింపు దశకు చేరకుంటున్న దశలో ఇక్కడ హత్యలు అరాచకాలు, అఘాయిత్యాలు పెరిగాయి. వెట్టిచాకిరి, హింస రాజ్యమేలాయి. ఈనేపథ్యంలోనే నిజాం అడుగులకు మడుగులొత్తే దొరలకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రజాపోరు ప్రారంభమైంది. ఈ పొగ సెగలు తన పీఠాన్ని కదిలిస్తుందని గ్రహించిన నిజాం రక్తపిసాసి, మతోన్మాది అయిన ఖాశిం రజ్వీని అతడి నాయకత్వంలో రజాకార్లను తెలంగాణ ప్రజలపైకి ఉసిగొల్పాడు(రజాకర్ అంటే స్వయం సేవకుడు). స్వయం సేవకులు నరరూప రాక్షసులై గృహదహనాలు, మానభంగాలు, హత్యలు, లింగ వయోభేదం లేకుండా తల్వార్లతో నరికి చంపడం, ప్రశ్నించిన వారి ప్రాణాలు తీయడం ఆనాటి వారి నిత్యకృత్యాలు. అది చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఆంధ్రజన మహాసభతో ఉత్తేజం పొందిన ఐలమ్మ ఆంధ్ర మహాసభ కార్యకర్తగా చేరి చురుగ్గా పనిచేసింది. మండలంలోని మల్లంపల్లి దొరల నుంచి కౌలుకు తీసుకున్న భూములను విస్నూరు దేశ్‌ముఖ్ కిరాయి గుండాలు పంట పొలాలపై దాడులు నిర్వహించి ధాన్యాన్ని స్వాధీన పరుచుకున్న క్రమంలో ఆంధ్ర మహాజన సభ కార్యకర్తలు ఐలమ్మకు అండగా నిలిచారు. కిరాయి రౌడీలను తరిమికొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. 1985 సెప్టెంబర్ 10న చాకలి ఐలమ్మ తుది శ్వాస విడిచింది. ఆమె దూరమై నేటికి 34ఏళ్లు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles