సత్యవతిరాథోడ్‌ అనే నేను..

Mon,September 9, 2019 03:18 AM

-గిరిజన, మహిళల సమస్యలు పరిష్కరిస్తా
-సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా...
-అందరినీ కలుపుకొని ముందుకుపోతా...
-నమస్తే తెలంగాణతో గిరిజన సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌
మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అత్యంత కీలక మంత్రి పదవి అప్పగించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కలుపుకుని జిల్లా అభివృద్ధికి కృషిచేస్తా. గిరిజన తండాలో నిరుపేద కుటుంబంలో పుట్టిన నాకు ప్రజల కష్టాలు తెలుసు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా పోడు రైతులు ఎదుర్కొంటున్న పోడు సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తా. అంతేకాకుండా బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి కావాల్సిన చర్యలు త్వరగా చేపట్టేందుకు నావంతు పాత్ర పోషిస్తా. నన్ను నమ్మి ఎమ్మెల్సీగా ఇవ్వడమే కాకుండా మంత్రిపదవి ఇవ్వడం జీవితంలో మరిచిపోలేను. గిరిజనుల సమస్యలతో పాటు పోడు భూముల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా. అంతేకాకుండా జిల్లాలో విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా” అని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

నమస్తే: మంత్రి పదవి రావడంపై ఎలా ఫీల్‌ అవుతున్నారు...?
మంత్రి: నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీతో పదవితోపాటు మంత్రి పదవి ఇవ్వడం సంతోషంగా ఉంది. జీవితాంతం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కృతజ్ఞతలు. తాను తెలంగాణ రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా ఎమ్మెల్సీ కావడమే కాకుండా మంత్రి పదవి రావడం సంతోషంగా ఉంది.
నమస్తే: జిల్లా అభివృద్ధికి ఎమి చేయబోతున్నారు?
మంత్రి:ఇప్పటికే మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. ఈ జిల్లా పరిధిలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తా. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులను కలుపుకుని పోతూ దశల వారీగా సీఎం కేసీఆర్‌ సహకారంతో అభివృద్ధి చేస్తా. గిరిజనుల సమస్యల పరిష్కారంతో పాటు విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తా.
నమస్తే: పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకుపోతారు.?
మంత్రి: 2014 నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నాను. 2016లో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు పార్టీ పటిష్టతకు, అధిష్ఠానం చెప్పిన పని విజయవంతంగా పూర్తిచేశాను. జిల్లా నాయకులతో ఉన్న పరిచయాలతో పార్టీని, అటు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతాను. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికలకు ఇన్‌చార్జీగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇన్‌చార్జీగా, పార్టీ సభ్యత్వ నమోదు సమయంలో నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో పని చేశాను.

నమస్తే: జిల్లాలో ముందుగా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు ?
మంత్రి: నేను సర్పంచ్‌ స్థాయి నుంచి జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా గెలిచాను. ఇప్పుడు మంత్రిగా అవకాశం వచ్చింది. రాజకీయంలో నాకున్న 34ఏళ్ల అనుభవంతో జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను. జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు ప్రజాప్రతినిధులు, ఇతర నాయకుల సహకారంతో ముందుకు సాగుతా..
నమస్తే: మీకు గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ ఇచ్చారు. ముందుగా ఏమి చేయబోతున్నారు ?
మంత్రి: గిరిజన మహిళనైన నాకు గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ ఇవ్వడం నిజంగా సంతోషంగా ఉంది. ఒక గిరిజన మహిళగా గిరిజనుల సమస్యలు నాకు తెలుసు. వాటిని దశల వారీగా పరిష్కరిస్తా. అదే విధంగా గిరిజనులు ఎక్కువగా పోడు భూముల సమస్యతో బాధపడుతున్నారు. వాటిని కూడా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. మహిళా శిశు సంక్షేమం ద్వారా అమలవుతున్న పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరవేయడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తా.
నమస్తే: జిల్లాలో ప్రజాప్రతినిధులను ఎలా సమన్వయం చేస్తారు?
మంత్రి: 34 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాకు పదవులు కొత్త కావచ్చు కానీ ఈ ప్రాంతం అంతా పాతదే. జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ నాకు బాగా సన్నిహితులు. వారి అనుభవాలతో సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాను. నాకు పార్టీలో పదవులు, ప్రభుత్వంలో పదవులు రావడానికి కృషి చేసిన జిల్లా ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీ కవిత, డోర్నకల్‌, మహబూబాబాద్‌, ఇల్లెందు ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌, శంకర్‌నాయక్‌, హరిప్రియలతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందులను కలుపుకొని ముందుకు సాగుతా..

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles