సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు...

Mon,September 9, 2019 12:47 AM

-తెలంగాణ ఉద్యమంలో తనవంతుపాత్ర
-టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి
-మురిసిన పెద్దతండా
-సంబురాలు చేసుకున్న కురవి మండల వాసులు
కురవి, సెప్టెంబర్‌ 08: కురవి మండలం గుండ్రాతిమడుగు శివారు పెద్దతండాలో 1969 అక్టోబర్‌ 31వ తేదీన గుగులోత్‌ లింగ్యానాయక్‌, దస్మీ ల చివరిసంతానంగా జన్మించిన సత్యవతిరాథోడ్‌కు గిరిజన సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవి వరించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన సత్యవతిరాథోడ్‌ తన స్వయంకృషితో, పార్టీ పటిష్టతకు కష్టపడుతూనే అంచెలంచెలుగా ఎదిగిందని సన్నిహితులు చెబుతున్నారు. 1984లో టీడీపీలో చేరిన సత్యవతిరాథోడ్‌ 1989లో డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి సమీప అభ్యర్థి డీఎస్‌ రెడ్యానాయక్‌ చేతుల్లో స్వల్ప ఓట్లతేడాతో ఓటమిని చవిచూశారు. 1995 సంవత్సరంలో సర్పంచ్‌గా జనరల్‌ స్థానం నుంచి సత్యవతిరాథోడ్‌ గెలుపొంది తొలిసారిగా ప్రజాప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2006 సంవత్సరంలో జెడ్పీటీసీగా నర్సింహులపేట మండలం నుంచి విజయం వరించింది. 2009 సంవత్సరంలో డోర్నకల్‌ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీచేసి కాంగ్రెస్‌ తరుపున పోటీచేసిన రెడ్యానాయక్‌పై గెలుపొందారు. అంతలోనే అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. తనకు అన్నింటిలో తోడుండి ధైర్యం చెప్పిన భర్త గోవింద్‌ 20వ తేదీ 2009 రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడంతో కోలుకోలేకపోయారు.

అనంతరం జరిగిన తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించింది. ఉద్యమనాయకుడు సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా 2014 సంవత్సరం మార్చి 03వ తేదీన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్‌ తరుపున రెడ్యానాయక్‌పై పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2016 సంవత్సరంలో సత్యవతిరాథోడ్‌ను సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నాటి నుంచి నేటి వరకు అదే పదవిలో కొనసాగుతున్నారు. 2019 సంవత్సరంలో సిట్టింగ్‌లకే ఎమ్మెల్యే టీకెట్‌లు ఇవ్వడంతో అప్పటివరకు టికెట్‌ రేసులో ఉన్న సత్యవతిరాథోడ్‌ నిరాశ చెందినా సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లపై నమ్మకంతో రెడ్యానాయక్‌ గెలుపులో తన వంతు పాత్ర పోషించింది. రెడ్యానాయక్‌ గెలుపుతోపాటు శంకర్‌నాయక్‌ గెలుపులో కూడా భాగస్వామ్యం అయ్యారు. కోదాడలో పార్టీ తరుపున అభ్యర్థుల గెలుపులో కీలక భూమిక పోషించడంతో అప్పుడే సత్యవతిరాథోడ్‌కు ఎమ్మెల్సీ వస్తుందనే ప్రచారం జోరుగా సాగింది.

ఇచ్చిన మాట నెరవేర్చే సీఎం కేసీఆర్‌ అందరి ఊహలకు అందకుండా ఎమ్మెల్యే కోటాలో సత్యవతిరాథోడ్‌ను ఎమ్మెల్సీ చేశారు. 2019 మార్చి 12వ తేదీన ఎమ్మెల్యే కోటా నుంచి టీఆర్‌ఎస్‌ తరుపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఎంపీ కవిత గెలుపులో కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రెండు జెడ్పీ చైర్మన్ల గెలుపులో కీలక భూమిక పోషించారు. ఎవరి ఊహకు అందకుండా సీఎం కేసీఆర్‌ మంత్రి వర్గ విస్తరణలో తొలి గిరిజన మహిళగా సత్యవతిరాథోడ్‌కు అవకాశం కల్పించారు. గిరిజన సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సత్యవతిరాథోడ్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేతులమీదుగా ప్రమాణ స్వీకారం చేశారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles