అద్వితీయ ప్రగతికి సహకరించాలి

Fri,August 16, 2019 05:16 AM

-తెలంగాణ సర్కార్ పాలన దేశానికే ఆదర్శం
-బాలికలు, మహిళల భద్రత కోసం అందరూ నడుం కట్టాలి
-మార్చి 2020 నాటికి దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి
-అన్ని రంగాల అభివృద్ధే మన లక్ష్యం
-రూ.20 వేల కోట్ల అంచనాతో కుడా మాస్టర్ ప్లాన్
-స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : రాష్ర్టాన్ని సాధించిన ఐదేళ్లల్లోనే తెలంగాణ అన్ని రంగాల్లో అద్వితీయ ప్రగతిని సాధించి దేశానికే తలమానికంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వల్ల ఈసారి వర్షాలు ఆలస్యంగా కురిసినా చెరువులన్నీ జలకళతో తొణికిసలాడుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, దార్శనికతతో సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మహోన్నతంగా తెలంగాణ ఆకాంక్షలకు అద్దంపట్టే విధంగా ప్రపంచమే అబ్బురపడుడే విధంగా నిర్మించి జాతికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన హన్మకొండలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలకు దేశ స్వాతంత్య్రం, తెలంగాణ అమరవీరుల త్యాగాలను, రాష్ట్ర సాధనవల్ల కలుగుతున్న ప్రయోజనాల గురించి మంత్రి తన ప్రసంగంలో ప్రస్థావించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అన్ని రంగాల్లో ముందుంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను రూపొందించి ఇక్కడి చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ఇనుమడింపచేస్తూ సరికొత్త పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..

2020 మార్చి నాటికి దేవాదుల పూర్తి
వరంగల్ ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా దేవాదుల ప్రాజెక్టు నిలుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి యజ్ఞంలో 2020 మార్చి నాటికి దేవాదులను పూర్తిచేస్తామన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం లింగంపల్లి-మల్కాపూర్‌లో 10.17 టీఎంసీల నీటినిలువ సామర్థ్యంతో నిర్మించే ప్రాజెక్టును నిర్మాణ పనులు చేపడతామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీని నింపేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎక్కువ లబ్ధి కలుగుతుంది. అలాగే 14వేల కోట్లతో నిర్మిస్తున్న జె.చొక్కారావు-దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను 2020 మార్చి లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ప్రపంచం అబ్బురపడేలా మేడారం
ఆదివాసీ గిరిజనుల పండుగ అయిన మేడారం జాతరకు తెలంగాణ ఏర్పాటుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. రాష్ట్ర పండుగ అయిన మేడారం జాతరను 2020 ఫిబ్రవరి 5 నుంచి 8వరకు ఘనంగా నిర్వహించేందుకు శాశ్వత వసతులు కల్పించుటకు ప్రణాళిక రూపొందిస్తున్నాం.

గ్రామ పంచాయతీలు
పనితీరులో గుణాత్మక మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీల అభ్యున్నతికి 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సంపూర్ణ పారిశుద్ధ పనులతో పాటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాల పనితీరును మానిటరింగ్ చేసి మెరుగు పరిచే బాధ్యతను, అధికారాలను కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం కల్పించింది.

మాస్టర్ ప్లాన్ 2041
వచ్చే 20 ఏళ్లలో వరంగల్‌ను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు రూ.20వేల కోట్ల అంచనాతో కుడా మాస్టర్ ప్లాన్ 2041ని రూపొందించడం జరిగింది. ఆధునిక పద్ధతిలో అన్ని ప్రధాన రోడ్లలో పక్కా డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ, జంక్షన్ల నిర్మాణంతో పాటు, గ్రోత్ కారిడార్ల ఏర్పాటుకు ఇన్నర్ రింగ్‌రోడ్, మూడు జిల్లాలను అనుసంధానం చేస్తూ అవుటర్ రింగ్‌రోడ్‌ను నిర్మించుటకు ప్రణాళిక తయారు చేశాం. భద్రకాళీ బండ్ సుందరీకరణ, పద్మాక్షి, జైన్ టెంపుల్ పునరుద్దరణ, ఖిలావరంగల్‌లో పురావస్తు ప్రదర్శనశాఖ పనులు పూర్తయ్యాయి.

అంకిత్‌కు అభినందనలు
చైనా-నేపాల్ సరిహద్దులో 6250మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాన్ని ఎక్కి జాతీయ జెండాతో పాటు కాకతీయ తోరణం గుర్తును ఎగురవేసేందుకు సాహస యాత్ర చేపట్టిన జిల్లా యువకుడు రాసమళ్ల అంకిత్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్, మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles