ప్రజెంట్ సార్...

Mon,July 22, 2019 02:06 AM

నెల్లికుదురు, జూలై 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీఠ వేస్తూ వినూత్న కార్యక్రమాలకు నాందిపలుకుతూ అమలు చేస్తున్నది. పిల్లలందరికీ పాఠశాలల ప్రారంభంనాటికే నూతన పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు... మధ్యాహ్న భోజనం... పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఇవన్నీ ఉన్నప్పటికీ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కాకపోవడంతో విద్యలో నాణ్యత కొరవడింది. ఈ మధ్య కాలంలో జరిగిన జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వేలు విద్యార్థుల్లో ప్రశ్నార్థకంగా మారిన నాణ్యతను గాడిలో పెట్టేందుకు ప్రతీ విద్యార్థి ఖచ్చితంగా వందశాతం హాజరయ్యేలా చేయాలని సూచించాయి. దీంతో ఆగస్టు 2019 మాసాన్ని హాజరు మాసోత్సవం గా ప్రకటించి అన్ని పాఠశాలల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ నాంది పలికింది.

సర్కారు బడుల్లో హాజరు మాసోత్సవ కార్యక్రమాన్ని ఆగస్టు 1 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ నెల 16న టీ-సాట్ ద్వారా నిర్వహించిన టెలీకాన్ఫెరెన్స్‌లో విద్యాశాఖ కార్యదర్శి అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం పెంచుతూ తద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సక్సెస్ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యచరణను రూపొందించి ప్రారంభించనున్నారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల ప్రారంభంనాటికే పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందివ్వడం, మధ్యాహ్న భోజనం తదితర కార్యక్రమాలెన్నింటినో అమలు చేస్తోంది. అయినప్పటికీ విద్యార్థుల క్రమంతప్పకుండా పాఠశాలకు హాజరు కాకపోవడంతో ప్రభుత్వం ఈ ఆగస్టు 2019 మాసోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కార్యచరణ ప్రణాళిక ఇది...
-2019-20 విద్యా సంవత్సరంలో బడిలో చేరిన పిల్లలందరూ క్రమంతప్పకుండా రోజు బడికి హాజరయ్యేలా చూడాలి. ప్రతీ పాఠశాలలో సగటున 100శాతం హాజరు ఉండేలా కృషిచేసి తద్వారా అభ్యసనాన్ని మెరుగుపర్చాలి.
-ప్రపంచంలోని ఏ దేశంలో లేనివిధంగా మన రాష్ట్రంలో చైతన్యవంతమైన సంఘటిత, సాధికారిత మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుని పిల్లల హాజరును పెంచవచ్చు.
- బడిలోని పిల్లల తల్లిదండ్రులను చైతన్య పర్చడానికి, వారిని అవగాహన కల్పించడానికి గ్రామస్థాయిలో గ్రామ సమాఖ్యలను, మండలస్థాయిలో మండల సమాఖ్యలను, జిల్లాస్థాయిలో జిల్లా సమాఖ్యల సేవలను వినియోగించుకోవాలి.
-పిల్లలను వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ద్వారా వారికి బడిపై ఆసక్తి పెరగడంతోపాటు చదువును ప్రభావితం చేస్తుంది. ఇందుకోసమై ప్రతీ పాఠశాలలో బాలల సంఘాలను ఏర్పాటు చేయాలి.
- రోజూ బడికి హాజరయ్యే పిల్లలను ఆ పాఠశాల ఉపాధ్యాయులు గుర్తించి అభినందించాలి. తద్వారా ప్రోత్సాహక వాతావరణం ఏర్పడుతుంది.
- ప్రతీ పాఠశాలలో అత్యధిక హాజరుశాతమున్న విద్యార్థులను గుర్తించి పాఠశాల అసెంబ్లీ, ఎస్‌ఎంసీ సమావేశాల్లో వారి తల్లిదండ్రులను అభినందించాలి.
-పిల్లల హాజరు శాతం అధికంగా ఉన్న పాఠశాలలను గుర్తించి మండల విద్యాశాఖ అధికారి ఆయా ఉపాధ్యాయులను అభినందించాలి. జిల్లాస్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి, రాష్ట్రస్థాయిలో కమిషన్ ఈ కార్యక్రమాలను నిర్వహించాలి.
- వివిధ శాఖలను భాగస్వాములను చేసి విద్యార్థుల హాజరు శాతం పెంచాలి.
- విద్యార్థులకు పాఠశాలపై ఆసక్తి కలిగేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి.
- బడిలో చేరిన పిల్లలందరికీ తాము చదువుకోగలుగుతున్నామని, నేర్చుకోగలుగుతున్నామనే భావన కలిగించి పాఠశాలపై ఆసక్తిని పెంపొందించాలి. తద్వారా హాజరు శాతం పెరుగుతుంది.
- తరుచూ పాఠశాలకు గైర్హాజరయ్యే పిల్లలను గుర్తించి నేరుగా వారింటికెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడికి హాజరయ్యేలా చూడాలి.
ఈ కార్యక్రమ కార్యాచరణ ప్రణాళికను అన్ని పాఠశాలల్లో అమలు పర్చి విద్యార్థులందరూ క్రమంతప్పకుండా సక్రమంగా రోజు బడికి వచ్చేలా చేయాలి. ఆగస్టు 2019 మాసంలో హాజరు మాసోత్సవంలో భాగంగా వీటన్నింటిని నిర్వహించడం ద్వారా పాఠశాల విద్యాశాఖలో నూతన ఉత్తేజాన్ని పెంపొందించి ఇతర రాష్ట్రలకు ఆదర్శంగా నిలిచేలా చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆగస్టు 2019 మాసారంభంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని గుర్తించి నెలాఖరుకు పాఠశాల వారీగా సాధించిన విద్యార్థుల హాజరు ప్రగతి వివరాల నివేదికలను జిల్లా విద్యాశాఖ ద్వారా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు పంపించాలి.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles