ధిక్కారస్వరానికి ప్రతీక

Mon,July 22, 2019 02:02 AM

చిన్నగూడూరు, జూలై 21 : నేను ఉద్యమోప జీవిని. నాకు ఆరాట పెట్టే సమస్య ఏదో వెంట ఉండాలి. ఆ సమస్య నా సొంతం అవకూడదు, అది పది మంది సమస్య అయి ఉండాలి . అని సన్నిహితులతో చమత్కరించే దాశరథి తొలి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచి నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగా ణ రైతాంగ సాయుధ పోరాటంలో తన కవితాస్త్రాలతో అక్షరమే అగ్నిధారగా తన పద్యమే పదునైన ఆయుధంగా మలిచి రుద్రవీణలు మోగించి నిజాం పాలనపై తన రచనలతో నిప్పులు చెరిగి తెలంగాణ ప్రజలను మేల్కొలిపిన దాశరథి కృష్ణమాచార్యులు ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన వెంటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు 1925 జూలై 22 జన్మించారు.
చిన్నగూడూరులో ప్రాథమిక విద్య
దాశరథి ప్రాథమిక విద్య చిన్నగూడూరులో కొనసాగింది. ఈ క్రమంలో గ్రామంలో నాటి భూస్వాములు ఆగడాలు పెచ్చు మీరడంతో అప్పటి పరిస్థితుల దృష్ట్యా దాశరథి కుటుంబం ఖమ్మం జిల్లా గార్లకు మకాం మార్చింది. అక్కడే హైస్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పుడే తెలంగాణపై నిజాం నిరంకుశ పాలన, పెత్తందార్ల అకృత్యాలను ఎలాగైనా అరికట్టాలని స్నేహితులతో చర్చించేవారు. విప్లవోద్యమం వైపు తన అడుగు లు కదిలించి కవితలు, రచనలను ఎక్కుపెట్టి తెలంగాణ ప్రజలను చైతన్య పరిచారు.

నా తెలంగాణ కోటిరతనాల వీణ
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నిజాం ప్రభుత్వం దాశరథిని నిజామాబాద్ జైలులో బంధించింది. శిక్ష అనుభవిస్తూ ధిక్కార స్వరంతో జైలు గోడలపై బొగ్గుతో ఓ నిజాం పిశాచమా..కానరాడు.. నిన్నుబోలిన రాజు మాకెన్నడేని.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసి నిజాం పాలకుల అకృత్యాలపై తోటి ఖైదీల్లో ఉద్యమ శంఖారావం పూరిస్తూ తెలంగాణపై తనకున్న మమకారాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు దాశరథి. నిజాం పాలకుల చేతిలో దోపిడీకి గురై కడు దీన స్థితి లో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలను తన రచనల ద్వారా జాగృత పరిచిన చైతన్యశీలి. పీడిత ప్రజల గొంతుకగా మారి తెలంగాణ ప్రజల బాధలను, భావాన్ని బహిర్గతం చేసిన మహనీయుడు దాశరథి.
ఎముకల్ నుసి జేసి.. పొలాలుదున్ని..బోషాణములన్ నిలిపిన రైతుదే తెలంగాణం అంటూ ముసలి నక్కకు రాజరికంబు దక్కునే అని నిజాం రాజులను ధిక్కరించి చెరసాలలో బంధింప బడ్డాడు.

వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
దాశరథి 95వ జయంతి వేడుకలను సోమవారం స్వగ్రామమైన చిన్నగూడూరులో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా దాశరథి జయంతి వేడుకలను ప్రతీ సంవత్సరం నిర్వహిస్తూ, వారి కుమారుడికి ఐటీ శాఖలో ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబానికి సముచిత స్థానం కల్పించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం దాశరథి పేర సాహితి పురస్కార అవార్డులను ప్రతీ సంవత్సరం అందిస్తుంది. నేడు చిన్నగూడూరులో జరిగే వేడుకలకు రాజకీయ ప్రముఖు లు, పలు సంఘాల నాయకులు కవులు,కళాకారులు,తెలంగాణ ఉద్యమకారులు పూర్వపు వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ జయంతి వేడుకలకు హాజరునానున్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles