మంత్రి ఎర్రబెల్లి సుడిగాలి పర్యటన

Wed,July 17, 2019 06:07 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, జూలై 16 : నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని వర్ధన్నపేట, తండాల్లో మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన రూ.24.70 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శంకుస్థాపన కార్యక్రమాలు సాయంత్రం 4 గంటల వరకు జరిగాయి. ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బెటితండా, డీసీతండా, స్వామితండా, నీలగిరిస్వామితండా, భవానికుంట తండాలో పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం వర్ధన్నపేట పట్టణంలోని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ఫిరంగిగడ్డ, కోనాపురం తదితర 12 వార్డులలో 28 చోట్ల సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శ్రీనిధి అధికారులు ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దయాకర్‌రావు పాల్గొని రూ.1కోటి 80 లక్షల 30వేలకు సంబంధించిన చెక్కులను మహిళలకు అందజేశారు. సమావేశానికి హాజరైన మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు మహిళా సంఘాల సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమావేశం పూర్తికాగానే మహిళా సంఘాల ప్రతినిధులు మంత్రిని సత్కరించారు.

తండాల్లో ఘన స్వాగతం
మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారిగా తండాలకు వచ్చిన మంత్రి దయాకర్‌రావుకు తండాల గిరిజనులు ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపాలిటీలో తండాలను విలీనం చేయడం పట్ల గిరిజనులు కొంత కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా గిరిజనులు ఓటింగ్‌కు దూరంగా ఉండి నిరసన తెలిపారు. ఈక్రమంలోనే మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో రానున్నందున గిరిజనులు నిరసన తెలియజేస్తారాని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఈ్ర కమంలోనే మంగళవారం తండాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు వెళ్లిన మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ఘనంగా స్వాగతం పలికారు. తండాలకు చెందిన గిరిజన మహిళలు డీజే పాటలకు కోలాటం నృత్యాలు చేస్తూ ఆప్యాయతతో స్వాగతం పలికారు. మంత్రి పేరు పేరునా పలకరించడంతో సంతోషం వ్యక్తం చేశారు.

హర్షం వ్యక్తం చేసిన గిరిజనులు
మున్సిపాలిటీలో తండాలను కలపడంపై నిరసన వ్యక్తం చేసిన గిరిజనులు మంగళవారం మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌లు మున్సిపాలిటీ ఏర్పాటు కావడం వల్ల తండాలు అభివృద్ధి చెందుతాయని వివరించడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో భాగమైనందున తండాలలో ఇంటి, విద్యుత్ పన్నులు భారీగా పెంచుతారని ప్రజల్లో అనుమానాలు ఉండడంతో వాటిని నేతలు నివృత్తి పరిచారు. ఒక్క పైసా కూడా అదనపు పన్నులు వేయకుండా తండాకు రోడ్లు, నీటి వసతితో పాటుగా ఉపాధి హామీ పథకాన్ని కూడా రూర్బన్ పేరుతో కొనసాగిస్తామని మంత్రి, ఎమ్మెల్యేలు వివరించారు. అంతేకాక మున్సిపాలిటీలో తండాలు ఉండడం వల్ల ఏవిధంగా అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని కూడా నేతలు సమగ్రంగా వివరించడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే తండాలు, వర్ధన్నపేట పట్టణానికి చెందిన నాయకులు, ప్రజలు మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే రమేశ్, ఎమెల్సీ శ్రీనివాస్‌రెడ్డిలకు ఘనంగా స్వాగతం పలికారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles