వేటు పడింది

Sun,July 14, 2019 01:53 AM

- గత మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చులు సమర్పించని అభ్యర్థులపై చర్యలు
- ఈసారి పోటీకి 41మంది అనర్హులుగా ప్రకటన
- 2020 ఆగస్టు 31వరకు నిషేధం అమలు
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మహబూబాబాద్ పట్టణంలో గత మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల ఖర్చులు సమర్పించని అభ్యర్థులపై రాష్ట్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో అభ్యర్థులు పెట్టిన ఖర్చుల వివరాలు ఇవ్వని వారిపై వేటు వేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీకి 2014లో ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు వివిధ రాజకీయ పార్టీల నుంచి పలువురు అభ్యర్థులు వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల ఖర్చులను చూపించని 41మంది అభ్యర్థులపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. 41మంది అభ్యర్థులు 2020ఆగస్టు 31వరకు పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో త్వరలో జరుగనున్న మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 41మంది అభ్యర్థులు పోటీచేసే అర్హతను కోల్పోయారు. ప్రతీ ఎన్నికల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత వారం రోజుల లోపు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు లెక్కలు సమర్పించాల్సి వస్తుంది. 2014లో ఎన్నికలు ముగిసిన తర్వాత మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పోటీచేసిన అభ్యర్థులు ఎన్నికల లెక్కలు సమర్పించనందున వారిని త్వరలో జరిగే ఎన్నికలకు అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

41 మందిపై వేటు..
2014 మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 28వార్డులకు గాను 112మంది పోటీచేశారు. ఇందులో 71మంది అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేసిన పూర్తి వివరాలను అందించారు. మిగిలిన 41మంది ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలను ఎన్నికల అధికారులకు అప్పగించలేదు. దీంతో ఎన్నికల ఖర్చుల అబ్జర్వర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గతంలో పోటీ చేసిన అభ్యర్థుల జాబితా ఆధారంగా 41మంది లెక్కలు సమర్పించనట్లుగా తేలడంతో ఎన్నికల సంఘం మొత్తం మీద కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో వారికి అనర్హత వేటు వేసింది. 2019లో నిర్వహించే మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు 2020 ఆగస్టు 31 వరకు ఈ అనర్హత వేటు వర్తిస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం 41మంది వేటు పడిన వారిలో కొంతమంది ఈసారీ నిర్వహించే మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయని చెప్పవచ్చును.

ఆశావహుల్లో ఆందోళన
త్వరలో నిర్వహించే మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకున్న ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు చూపనందున వారిని ఇప్పుడు పోటీకి అనర్హులుగా గుర్తించారు. దీంతో త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలకు వారు అనర్హులని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు చాల జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈసారీ ఎన్నికల్లో ఖర్చుల వివరాలు చూపించకుంటే వచ్చే ఎన్నికల వరకు ఎవరికైనా ఇదే పరిస్థితి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా ముందు నుంచే లెక్కలు సరిగా రాసుకొని ఖర్చుల వివరాలు అందించాలని ఆశావహులు భావిస్తున్నారు. మొత్తంమీద ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో మహబూబాబాద్ పట్టణంలో చర్చనీయాంశమైంది.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles