మర్రికుంట మింగేసింది

Sat,July 13, 2019 04:44 AM

కురవి, జూలై 12: మండలంలోని తిర్మాలాపురంలోని మర్రికుంట ఇద్దరు చిన్నారుల ప్రాణాలను మింగేసింది. పాఠశాలకు తీసి ఉంటే ఆ రెండు చిన్నారుల ప్రాణాలు నిలబడేవి. బడి ఉందనుకుని ఇంటి నుంచి వచ్చిన చిన్నారులు(అన్నదమ్ములు)స్నేహితులతో కలిసి ఆడుకుం టూ బడిపక్కనే ఉన్న కుంటలో పడి విగతజీవులైన విషాద సంఘటన తొలి ఏకాదశి పర్వదినాన మండలం తిర్మలాపురం గ్రామాన్ని విషాద ఛాయల్లోకి నెట్టివేసింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన చింతనూరి శ్రీను, హైమలకు ఇద్దరు కుమారులు సూర్యతేజ(10), విశాల్(06). శ్రీను అక్క విజయను కురవి మండలం మోద్గులగూడెం గ్రామానికి చెందిన ఐలి వీరన్న కు ఇచ్చి పెళ్లి చేశారు. శ్రీనుకు బతుకు తెరువు ఇబ్బందిగా మారడంతో బావ ఊరికి కుటుంబ సమేతంగా వెళ్లాడు. శ్రీను కరెంటు పనులతోపాటు రోజుకూలీకి వెళ్తూ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడు. 10 సంవత్సరాల పాటు మోద్గులగూడెంలో ఉన్న శ్రీను కుటుంబం రెండు సంవత్సరాల కింద తిర్మలాపురంలోని తిరుమల బయో వర్మీకంపోస్టులో నైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తూ, అక్కడే జీవిస్తున్నాడు. కుమారులు ఇద్దరిని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. పెద్దకొడుకు సూర్యతేజ మూడో తరగతి, చిన్నకొడుకు ఒకటో తరగతి చదువుతున్నారు. రోజూ లాగానే బడికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన అన్నదమ్ములకు సెలవు అని తెలిసింది. దీంతో బడి పక్కనే ఉన్న పులిసెరు భద్రయ్య కుమారుడు శంకర్‌తో కలిసి ఆడుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి బడికి కూతవేటు దూరంలో ఉన్న మర్రికుంటలోఈతకని వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అది గమనించిన యుగేంధర్ అనే రైతు వారిని మందలించి, ఇంటికి వెళ్లమని చెప్పి తను వ్యవసాయ పనులపై వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా మధ్యాహ్నం 1గంటలకు కుమారులు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు చుట్టుపక్కలవారిని అడిగి వెతకడం మొదలెట్టారు. అలా వెతుకుతూ కుంటవద్దకు వెళ్లిన గ్రామస్తులకు చెప్పుల గుర్తులు కనపడ్డాయి. అనుమానంతో కుంటలోకి దిగి వెతుకగా చిన్నారుల మృతదేహాలు బయటపడ్డా యి. విషయం తెలసుకున్న చిన్నారుల తల్లి హైమ, తండ్రి శ్రీనుల రోదనలు మిన్నంటాయి. అందరి తలలో నాలుకలా ఉండే శ్రీను, హైమలు రోదిస్తున్న తీరు ప్రతీ ఒక్కరిని కంట తడిపెట్టించింది. విషయం తెలుసుకున్న కురవి ఎస్సై సం ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మానుకోట ఏరియా దవాఖానకు తరలించారు.
మృతదేహాలను సందర్శించిన ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్
చిన్నారుల మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కంటతడిపెట్టారు. తల్లి హైమను ఓదార్చారు. మీకు ఎటువంటి సహాయమైన చేస్తామని ధైర్యం చెప్పారు. అక్కడే ఉన్న ఎస్సై నాగభూషణంతో ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య, సర్పంచ్ కొర్ని రాంబాబు, ఉప సర్పంచ్ కల్లెపు సుధాకర్, నాయకులు ఐలి నరహరి, బోడ శ్రీను, బాదె నాగయ్య, కల్లెపు నాగన్న, కల్లెపు శ్రీను, బొమ్మగాని నారాయణ, కృష్ణ తదితరులు ఉన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles