శ్రీను మృతిపై పెలుబికిన నిరసన

Sat,July 6, 2019 02:54 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జులై 5:తొర్రూరు డివిజన్ కేంద్రంలోని తొర్రూరు పెద్ద చెరువు కట్ట వెడల్పు పనులు కొనసాగుతున్న తరుణంలో ట్రాక్టర్‌గా డ్రైవర్‌గా పని చేస్తూ చెరువు కట్టపై మొరం పోసి తిరిగి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తాకొట్టి తొర్రూరు శివారు దస్రూతండాకు చెందిన భూక్య శ్రీను(24) గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీను మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మహబూబాబాద్‌కు తరలించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తొర్రూరుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, సుమారు ఎనిమిది నెలల పాప ఉండడంతో శ్రీను మృతి చెందినా రెండు రోజులుగా చెరువు కట్ట పనులు చేసే కాంట్రాక్టర్ ఏ మాత్రం స్పందించడం లేదని తీవ్రస్థాయిలో నిరసన చెలరేగింది. మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, తండా వాసులు ఏకమై పెద్ద ఎత్తున తరలి వచ్చి చెరువు కట్ట వద్ద మృతదేహాన్ని ఉంచి కాంట్రాక్టర్ వచ్చి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన చెరువు కట్ట దగ్గరకు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

హైవేపై నిరసన...
తొలుత చెరువు కట్ట వద్ద ఆందోళన చేసిన తండావాసులు నేరుగా మృతదేహానికి తీసుకువచ్చి బస్టాండ్ ముందు వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై పెట్టి ఆందోళన చేశారు. సుమారు 40 నిమిషాల పాటు నిరసన కొనసాగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయ్యాయి. సీఐ వి.చేరాలు, తొర్రూరు, దంతాలపల్లి, నెల్లికుదురు, పెద్దవంగర ఎస్సైలు సీహెచ్.నగేశ్, నందీప్, రాంచరణ్‌తో పాటు పోలీస్ సిబ్బంది ఆందోళన విరమింప చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మృతుడు శ్రీను కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళన తీవ్రతరం చేశారు. మృతునితో ఎలాంటి సంబంధం లేని కొంత మంది ఆందోళనకారులతో జతకట్టేందుకు ప్రయత్నించిన తరుణంలో సీఐ చేరాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. అమ్మాపురం ఎంపీటీసీ విక్రంరెడ్డి ఆందోళనకారుల వద్దకు వచ్చి నినాదాలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు తీసుకుని వెళ్లారు. చివరికి కాంట్రాక్టర్‌తో మాట్లాడుతామని, న్యాయం చేయిస్తామని సీఐ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఘటన ప్రదేశానికి తొర్రూరు డీఎస్పీ జి.మదన్‌లాల్ చేరుకుని మృతుడి కుటుంబీకులు, బంధువులతో మాట్లాడి శనివారం ఉదయం 10 గంటల వరకు తొర్రూరుకు వస్తే చట్టప్రకారం కేసు నమోదు చేసి శ్రీను కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.

అంతిమ సంస్కారాలకు ఆర్ధిక సహకారం...
పోలీసులు శ్రీను కుటుంబీకులకు నచ్చజెప్పిన తర్వాత మృతదేహాన్ని దస్రూతండాకు తీసుకుని వెళ్లారు. శుక్రవారం కూడా దహనసంస్కారాలు నిర్వహించకుండా శనివారం పరిస్థితిని బట్టి ముందుకు వెళ్లేలా యోచిస్తుండగా మండల అభివృద్ధి కమిటీ చైర్మన్, టీఆర్‌ఎస్ నేత డాక్టర్ పి.సోమేశ్వర్‌రావు తండాకు చేరుకుని బాధితులతో మాట్లాడి నచ్చజెప్పి అంతిమ సంస్కారాలకు రూ.10వేల ఆర్ధిక సహకారాన్ని అందజేశారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles