పార్టీ నిర్మాణం వైపు అడుగులు..

Wed,June 26, 2019 02:05 AM

-టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పెద్దపీట
-27నుంచి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు
-సభ్యత్వ నమోదు తర్వాత గ్రామ, మండల కమిటీల ఏర్పాటు
-పార్టీ బలోపేతానికి సమావేశాలు
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్ ఆవిర్భవించి ఎంతో పోరాటం చేసిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం సాధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి అధికార పగ్గాలు చేపట్టింది. 2018 డిసెంబరులో రెండోసారి అధికారంలోకి వచ్చి టీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో గ్రామగ్రామాన టీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ చర్యలు చేపట్టింది. గ్రామ, మండల కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించింది. ఈనెల 27న పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నారు. అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగనుంది. జిల్లాలోని 16మండలాల నుంచి సుమారు 1.40లక్షల సభ్యత్వ నమోదు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అడుగులు వేస్తున్నారు. టీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యువనేత, టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామస్థాయి నుంచి మొదలు కొంటే జిల్లా స్థాయి వరకు పటిష్టమైన నిర్మాణంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణానికి ఇప్పటికే భూమిపూజ నిర్వహించారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయ నిర్మాణాలకు ఒక్కో జిల్లాకు రూ.60లక్షలను టీఆర్‌ఎస్ పార్టీ కేటాయించింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ బలోపేతానికి సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ కార్యాలయాలు ఒక వేదికగా మారనున్నాయి.

పార్టీ కోసం అంకితమై పనిచేసే కార్యకర్తలను, నాయకులను గుర్తించి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వివిధ స్థాయిల్లో పార్టీకి సేవలు చేస్తున్న వారిని గుర్తించి వారికి సముచితం స్థానం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. నిత్యం పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు, నాయకులకు పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో టీఆర్‌ఎస్ కార్యాలయానికి ఎకరం స్థలం కేటాయించడంతో పాటు కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ సైతం నిర్వహించారు. వీలైనంత త్వరగా జిల్లా కార్యాలయ నిర్మాణం పూర్తిచేసి కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా శరవేగంగా పనులు చేస్తున్నారు. దసరా పండుగ నాటికి జిల్లా కార్యాలయాలు ప్రారంభించాలని పార్టీ యోచిస్తోంది. 24న జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. పార్టీని గ్రామగ్రామాన పటిష్టం చేసేందుకు ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది. పార్టీ నిర్మాణం పటిష్టంగా చేపట్టాలని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. రానున్న రోజుల్లో గ్రామస్థాయి నుంచి మొదలు కొంటే జిల్లాస్థాయి వరకు పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ముందుకు సాగుతున్నారు.

సభ్యత్వ నమోదును ప్రారంభించనున్న పార్టీ అధినేత
ఈ నెల 27న మధ్యాహ్నం 2.30గంటలకు హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో పార్లమెంటరీ పార్టీని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్ శాసనసభ పక్షాన్ని, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు అందజేయనున్నారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసే 11 ప్రత్యేక కౌంటర్లలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేరోజు టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు తీసుకోనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఆ మరుసటి రోజు నుంచి జిల్లాలో అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో సభ్యత్వనమోదు ప్రక్రియను టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు జోరుగా చేపట్టనున్నారు.

సభ్యత్వ నమోదు తర్వాత గ్రామ, మండల కమిటీలు
జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ముగిసిన తర్వాత గ్రామ, మండల కమిటీలను పార్టీ ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా 27నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. మొదట హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకుంటారు. అనంతరం జిల్లాలోని 16మండలాల్లో సభ్యత్వ నమోదును ఒక ఉద్యమంలా చేపట్టనున్నారు. అనంతరం గ్రామ, మండల కమిటీలను ఎన్నుకోనున్నారు. సభ్యత్వ నమోదులో జిల్లాను యూనిట్‌గా కాకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారుగా 50వేల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు కలిపి లక్ష లక్ష్యం ఉండొచ్చని నాయకులు భావిస్తున్నారు. అదే విధంగా తొర్రూరు, పెద్దవంగర మండలాలకు 20వేలు, బయ్యారం, గార్ల 15వేలు, కొత్తగూడ, గంగారం మండలాలకు కలిపి 6వేల సభ్యత్వ నమోదు లక్ష్యంగా నిర్ణయించే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1.40లక్షల సభ్యత్వం నమోదు అయ్యే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పార్టీ అభివృద్ధికి కష్టపడిన కార్యకర్తలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేయనున్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles