బీజేపీ ఆందోళనలో అపశృతి

Tue,June 25, 2019 03:03 AM

రెడ్డికాలనీ, జూన్ 24: తొమ్మిది నెలల చిన్నారిని అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు చేస్తున్న దిష్టిబొమ్మ దహనంలో అపశృతి జరిగింది. హన్మకొండ అంబేద్కర్ సెంటర్‌లో నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఆందోళనకు దిగింది. నిందితుడిని వెంటనే ఉరితీయాలని ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో బీజేపీ కార్యకర్త పెట్రోల్ పోసి అంటించారు. మరో కార్యకర్త బాటిల్‌లో పెట్రోల్ తీసుకొచ్చి కాలుతున్న దిష్టిబొమ్మపై పెట్రోల్ పోస్తుండగా ప్రమాదవశాత్తు బాటిల్ పడిపోగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలతో బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ చేతికి మంటలు అంటుకుని గాయా లు కాగా మరో బీజేపీ నాయకుడు బింగి శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి మంటలార్పారు. వెంటనే స్పందించిన పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దిష్టిబొమ్మ దహనం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఈ సంఘటన జరిగిందని ఆరోపిస్తూ పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన బీజేపీ నాయకులు పోలీసు వాహనంపై రాళ్లు విసరడంతో వాహనం అద్దాలు పగిలాయి.

ఆస్పత్రి వద్ద ఆందోళన
గాయపడిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బింగి శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పో లీసులు అడ్డుకోవడం వలనే తమ నాయకులు గాయ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి అత్యవసర చికిత్స విభాగం వద్ద ఆందోళనకు దిగారు. సుబేదారి సీఐ సదయ్య, ఎస్సై మహేందర్ శాంతియుతంగా దిష్టిబొమ్మ దహనం చేస్తున్న క్రమంలో అడ్డుకోవడం వలనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న సుబేదారి సీఐ సదయ్య, హన్మకొండ ఎస్సై రంజిత్ ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను సముదాయించారు. ఈ క్రమంలో సుబేదారి సీఐ సదయ్య సెల్‌ఫోన్‌లో వీడియో పుటేజీలను అక్కడున్న బీజేపీ నాయకులకు చూపించి తమ ప్రమేయం లేదని తేటతెల్లం చేశారు.

ఆందోళనకారులపై కేసు నమోదు
పెట్రోల్ పోసి దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం నాయకుడు రాజుపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సుబేదారి సీఐ సదయ్య తెలిపారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles