సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

Tue,June 25, 2019 03:02 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 24 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో జిల్లాలోని నలుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. ప్రజావాణిలో 150 దరఖాస్తులను ప్రజలు కలెక్టర్‌కు సమర్పించారు. అందులో అధికంగా వినతులు సదరం ధ్రువీకరణ పత్రాలు, తాత్కాలిక ఉద్యోగం, భూ వివాదాల పరిష్కారం, పింఛన్లు కావాలని వచ్చాయి. ప్రజావాణిలో వచ్చిన వినతులను మానవతా దృక్ఫథంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత మేరకు అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. ప్రజావాణిలో హిజ్రాలు తమకు ప్రభుత్వం కలిపించే అన్ని పథకాలు వర్తించేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. ప్రజావాణిలో నేటి వరకు 14055 వినతులు రాగా 12253 వినతులను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన 3222 వినతులను ఆయా శాఖల వారు వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తూ వాటి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా హరితహారం, ఓడీఎఫ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ రూ.8 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ డేవిడ్, అన్ని శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles