ప్రభుత్వ పాఠశాలలకు పెరుగుతున్న ఆదరణ

Tue,June 25, 2019 03:01 AM

బయ్యారం, జూన్ 24 : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థి వికాసానికి వేదికలుగా వెలుగొందుతున్నాయి. ఇటీవల కాలంలో ఉన్నత విద్య, ఉద్యోగాల సాధనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే ముందంజలో ఉంటున్నారు. సుశిక్షుతులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు విజ్ఞానవంతులు అవుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో పభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యలు సైతం ఉండకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ స్వరాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మార్పులు చోటుచేకున్నాయి. నూతన సాంకేతిక బోధనా పద్ధతులు, ప్రయోగాత్మక, సులభతర విద్యతో విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయి. ఒత్తిడి లేని నాణ్యమైన విద్య అందుతోంది. ఎన్నడు లేని విధంగా ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు ఆసక్తి కలగటంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలపై ఆదరణ పెరుగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యర్థుల సంఖ్య పెరుగుతుంది.

సర్వతోముఖాభివృద్ధికి వేదిక..
ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి వేదికలు. ప్రతీ విద్యార్థి సమాజంలో రాణించేలా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవిన విద్యార్థి బయటి ప్రపంచంలో స్వతంత్రంగా రాణించగలుగుతారు. సీసీ విధానం అమలవుతున్నా ప్రైవేట్‌లో మొక్కుబడిగానే పాటిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో నేటికీ బట్టీపట్టే విధానమే కొనసాగుతుండటం గమనార్హం.

ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్లం
అంగన్‌వాడీ పాఠశాలల నుంచే అంగ్ల అక్షరాలపై అవగాహన ప్రారంభమవుతోంది. కొన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన కొనసాగుతోంది. ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో తరగతులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.
పౌష్టికాహారం అందిస్తూ..
విద్యార్థుల సౌకర్యం కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తుది. గ్రామీణ ప్రాంతాల్లో పనులకు వెళ్లిన తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా బడిలో చదువుకుంటున్నారనే భరోసానిచ్చింది.
పుస్తకాలు, దుస్తులు సమకూరుస్తూ..
బడులు తెరవగానే పుస్తకాలు కొనివ్వడం తల్లిదండ్రులకు తలకు మించిన భారమే. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పాఠశాల తెరిచిన రోజునే విద్యార్థి చేతికి పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అందించేలా విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. దీనికోసం ఇప్పటికే అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేసింది. మరోవైపు బాలికలకు కేసీఆర్ హెల్త్ కిట్లు కూడా అందిస్తోంది.
ఆధునిక సౌకర్యాలతో..
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఉన్నత పాఠశాలలోనూ అత్యాధునిక సామగ్రితో సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, ప్రొజెక్టర్ ద్వారా ప్రయోగాత్మక విద్యాబోధన, వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ప్రత్యేక తరగతులు, రోజువారీ పరీక్షలు వంటివన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో నేడు అందుబాటులో ఉన్నాయి. ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసుకుంటున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles