టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది

Sun,June 23, 2019 02:47 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 22: టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటుందని జెడ్పీచైర్‌పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లు అన్నారు. శనివారం బంజారభవన్ పక్కన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని అన్నారు. ప్రజల సౌలభ్యం కోసం రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్మించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పార్టీ కార్యాలయం వల్ల ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేయాలని పార్టీ నిర్ణయించిందని, జూన్ 24వ తేదీన 32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూమిపూజ కార్యక్రమం చేయాలని కేటీఆర్ ఆదేశించారన్నారు. ఆయన ఆదేశం మేరకు జిల్లాలో పార్టీ కార్యాలయం శంకుస్థాపన చేస్తున్నామన్నారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత ముందస్తుగా నిర్మాణ పనులకు రూ. 60 లక్షల రూపాయలు నిధులు పార్టీ మంజూరు చేసిందని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు,

ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ హజరవుతారన్నారు. టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ అయినందున తెలంగాణ రాష్ట్ర సాధనలో కనీసం సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా రోడ్ల మీద, సందులలో నిర్వహించుకునేవారమని, పార్టీ బలమైన శక్తిగా ఎదిగినందున పార్టీ కార్యక్రమాలను చర్చించుకొనేందుకు కార్యాలయం అవసరమని అధిష్టానం భావించిందని అన్నారు. కాగా 32 జిల్లా కార్యాలయాలు ఒకే డిజైన్‌తో ఉంటాయని అన్నారు. జెడ్పీచైర్‌పర్సన్ ఆంగోతు బిందు మాట్లాడుతూ.. జూన్ 24వ తేదీన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నదని అన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డేవిడ్, టీఆర్‌ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, మూల మధుకర్‌రెడ్డి, యాళ్ల మురళీధర్‌రెడ్డి, యాస వెంకట్‌రెడ్డి, మార్నేని రఘు, ఎల్లిమల్లయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


102
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles