తీరని విషాదం

Sun,June 23, 2019 02:47 AM

కురవి, జూన్ 22: ఎటు చూసిన పెడబొబ్బలు...ఆర్తనాదాలతో శుక్రవారం రాత్రి వరకు విషాదంలో మునిగిన చింతపల్లి కోలుకోలేదు. అందరితో కలివిడిగా తిరిగే అన్నదమ్ముల కుటుంబాలలో ఒకేసారి ఆరుగురు మృతిచెందడంతో తీరిన విషాద చాయలు అలాగే ఉన్నాయి. చింతపల్లి సెంటర్‌లో చికెన్‌షాప్ నడుపుకునే అప్జల్ పాషా(బాబులాల్), చింతపల్లికి కూతవేటు దూరంలో ఉన్న కందికొండ క్రాస్‌రోడ్డు వద్ద చికెన్‌షాప్ నడిపే మహబూబ్‌పాషా(పాషా)లు అందరితో కలివిడిగా కలిసి మెలి సి అక్కా..బావ...అమ్మా..బాయి..అంటూ ఆత్మీయంగా కలిసి ఉంటారు. గ్రామ డీలర్ దేవకమ్మ వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చిన్నతనం నుంచి అప్జల్ ఇంటికి ఎదురుగా ఉండడంతో సొంత తోబుట్టువు కంటే ఎక్కువగా మాతో కలిసి మెలిసి ఉండేవాడన్నారు. అదేవిధంగా చిన్నలాలుతండాకు చెందిన ఎర్ర బాలాజీని కదలించగా అసలు ఎంత బాధలో ఉన్న బాబులాల్‌తో మాట్లాడితే ఆ బాధ అంతా తీరేదని అన్నారు. బాబులాల్ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్‌కు అనుంగ అనుచరుడిగా పేరొందాడు. రెడ్యానాయక్ ఏ ఎన్నికల ప్రచారం మొదలెట్టిన బాబులాల్ వెంటనే అల్లా ఆశీర్వాదం ఉండాలంటూ దట్టీని కట్టడం సాంప్రదాయంగా మార్చుకున్నాడు. బాబులాల్ కంటే బాబులాల్ భార్య గౌసియా బేగం ఇంతవరకు ఎవరిమీద కోపం ప్రదర్శించలేదని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొనే పాషా అంటే అందరికీ వల్లమాలిన అభిమానం. మైనార్టీ నాయకుడిగా పాషా ఎన్నో సేవలు చేశారు. ఎవరికి ఆపద వచ్చిందన్నా వెంటనే వెళ్లిపోవడం పాషా అలవాటు. పాషాకు సొంత ఇల్లులేదు. మహబూబ్‌పాషా అంటేనే ఆత్మీయతకు అర్థమని అతడి సన్నిహితుడు మాజీ సర్పంచ్ జెర్రిపోతుల రంగన్నగౌడ్ తెలిపాడు. తన పిల్లలను ప్రయోజకులను చేయాలనేదే పాషా ఆశయమన్నారు. చిన్నపాప ముష్కాన్ డాన్స్ చేస్తే ఎవరైన ప్రశంసించాల్సిందేనన్నారు.

వారి ఆశలు ఆడియాశలు అయ్యాయి...
మహబూబ్‌పాషా భార్య మహమూదాబేగం ఆశాకార్యకర్తగా పనిచేస్తూ అందరి మన్ననలు అందుకుందని సెకండ్ ఏఎన్‌ఎం జ్యోతి తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంత సంబురాలలో పాల్గొనాలని గురువారం రాత్రి మహమూదాకు ఫోను చేశానని గద్గద స్వరంతో తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున లేవగానే ఇంటికి వచ్చావా అని ఫోను చేద్దామని తీయగానే...నేను సీఐని మాట్లాడుతున్నానని తెలపడంతో నా పంచ ప్రాణాలు పోయాయని తెలిపింది. నేను నంబరు తప్పుగా కొట్టానా అని సరి చూసుకున్నానని, ఇది మా మహమూదా బేగందే అని మరోసారి అడగగా వారు విషయం తెలపడంతో ఏమి చేయాలో పాలుపోలేదని పేర్కొంది. అక్కడి నుంచి సీఐ వీడియోలు పంపగానే నా కాళ్లు చేతులు ఆడలేదని తెలిపింది. మహమూదా మాట్లాడిన ప్రతిసారి నా ఇద్దరు బిడ్డలను ఒకరిని డాక్టరు చేస్తా మేడం అంటూ ఉండేదని, ఆ ఆశ తీరకుండానే మహమూదా తన చిన్నారులతో సహా వెళ్లిపోయిందని తోటి ఆశ కార్యకర్తలు కాళీశ్వరి, వినోద, నిర్మల, జయమ్మ, సుజాత, వెంకటలక్ష్మి, భద్రకాళిలు తెలిపారు. చెప్పిన పనిని చేసే మహమూదా లేదంటే నమ్మలేని బలపాల, కురవి పీహెచ్‌సీ వైద్యులు జితేందర్, శ్వేతలు, ఏఎన్‌ఎంలు,వైద్య సిబ్బంది అందరు వచ్చి శుక్రవారం మహమూదా మృతదేహాన్ని చూసి, వారి చిన్నారులను చూసి బోరున విలపించారు.

ఏ ఫంక్షన్ అయిన అందరు కలవాల్సిందే...
ఇబ్రహీం, అమీనాబేగంల కుమారులు మా త్రం ఎంత పని ఉన్నా కలవాల్సిందే. అంత నిక్కచ్చిగా ఉంటారని, ఒక్క వారి కుటుంబంలోనే కాదు..ఇతర కులాల కుటుంబాలలో కూడా కులబేధం లేకుండా కలిసిపోవడం వారి కే దక్కుతుందని బాబులాల్ అల్లుడు అక్బర్ బోరున విలపించాడు. అక్బర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం లేవగానే తన తండ్రి ఫోనుచేసి టీవీలో వార్తలు వస్తున్నాయి..మనవారు ఎటైన వెల్లారా అంటూ కొడుకు వద్ద ఆరా తీశారు. నేను కనుక్కుంటానని చెప్పి మామ(మేనమామ) సెల్‌కు ఫోన్ చేయడంతో కోదాడ ఎస్సై ఫోను ఎత్తాడు. మా మామకు ఇవ్వమంటే మాట్లాడే పరిస్థితుల్లో లేడని చెప్పడంతో విషయం తెలుసుకున్న భార్య రేష్మ ఆరోగ్య పరిస్థితి గమనించి చెప్పకుండా బయలుదేరామని దగ్ధద స్వరంతో తెలిపాడు.

ఇంత పెద్ద విషాదం మండలంలో రెండోది
రోడ్డు ప్రమాదంలో ఒకేసారి నలుగురు, అంతకంటే ఎక్కువ మంది మృతిచెందడం కురవి మండలంలో ఇది రెండవసారి. 1992వ సంవత్సరంలో కురవి టైలర్సు(దర్జీ) అసోసియేషన్ ఆధ్వర్యంలో వేములవాడ దర్శనానికి వెల్లి తిరుగు ప్రయాణంలో వరంగల్ రూరల్ జిల్లా వద్ద ఆగి ఉన్న లారీని 14మంది ప్రయాణిస్తున్న జీపు ఢీ కొనడంతో అక్కడికక్కడే నలుగురు దుర్మరణం పాలయ్యారు. 27 సంవత్సరాల తరువాత చింతపల్లి యాక్సిడెంట్‌తో మండలం ఉలిక్కిపడింది.

మృత్యుంజయుడు....
బాబులాల్, గౌసియాబేగంకు ఒక కుమార్తె రేష్మా, కుమారుడు జాకీర్‌పాషాలు ఉన్నారు. తన కుమారుడు కష్టపడవద్దని కష్టం అనిపించిన చికెన్‌షాప్‌ను నడుపుతూ కొడుకును బీటెక్ చేయిస్తున్నాడు. ఏడుగురు కుటుంబసభ్యులు ప్రయణిస్తున్న ఆటో ప్రమాదంలో కళ్లముందే ఆరుగురు కుటుంబసభ్యులను కోల్పోయిన జాకీర్‌పాషా గాయాలతో బయటపడ్డాడు. తనను అమితంగా ప్రేమించే తల్లిదండ్రులు, బాబాయిపిన్ని, చెల్లెలను కోల్పోయిన నన్ను ఎందుకు బతికించావు దేవుడా అంటూ రోధిస్తున్నట్లు అతని సన్నిహితుడు కొంపల్లి సతీశ్ తెలిపారు. తనతల్లిదండ్రులు చనిపోయారని తెలుసుకున్న జాకీర్ గాయాలను, వైద్యుల సలహాలను లెక్కచేయకుండా తల్లిదండ్రుల అంత్యక్రియలలో పాల్గొని పున్నామనరకం ప్రసాదించాడని గ్రామస్తులు అభినందిస్తున్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles