మున్సిపాలిటీకి కొత్త శోభ

Sun,June 23, 2019 02:47 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, జూన్ 22: సరిగ్గా ఏడాది తిరగక ముందే మరిపెడ మున్సిపాలిటీకి కొత్త శోభ ఏర్పడనుందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నా రు. శనివారం మరిపెడ మున్సిపాలీటిలో రూ.20కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన తనయ, మానుకోట ఎంపీ మాలోత్ కవితతో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మరిపెడ విశ్రాంతి భవనం వద్ద మరిపెడ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కమిషనర్ సింగారపు కుమార్ అధ్యక్షతన జరిగిన సభల్లో ఎమ్మె ల్యే పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల కిత్రం తండాలను జీపీలుగా మార్చే క్రమంలో మరిపెడ జీపీ ఐదారు పంచాయతీలుగా ఏర్పడే అవకాశం ఉండే. ఇక్కడి నేతలు, ప్రజల కోరిక మేరకు మరిపెడ జీపీని చెల్లాచెదురు కానివ్వొద్దని గుర్తించి అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను కలిసి మరిపెడ, డోర్నకల్ పట్టణాలను కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. మున్సిపాలిటీలతోనే ఇక్కడి సమస్యలు పరిష్కారం కావని గ్రహించి మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు కావాలని కోరడంతో రెండు పట్టణాల అభివృద్ధి కి కేటీఆర్ రూ.20కోట్ల చొప్పున రూ. 40కోట్లు మంజూరు చేయించారని ప్రజలకు వివరించారు.

మరిపెడకు కొత్త శోభ
మరిపెడ పట్టణం కొద్ది రోజుల్లోనే కొత్త శోభతో అవతరిస్తుందని రెడ్యానాయక్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ నుంచి ఖమ్మం రోడ్డులోని కాకతీయ కళాతోరణం వరకు రూ.3,44 కోట్లతో రోడ్డు డీవైడర్ల ఏర్పాటుతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం, హైమాస్ట్ లైట్లు అమర్చనున్నట్లు తెలిపారు. రూ.80లక్షలతో ఆడిటోరియం, రూ.85లక్షలతో గ్రీన్‌పార్క్, రూ.53లక్షలతో మరిపెడ గ్రామంలో శ్మశానవాటిక, రూ.35లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని అన్ని వాడలు, అవాస ప్రాంతాలను కలుపుతూ 11.572కిలో మీటర్ల ఇంటర్నల్ రోడ్లను రూ.5.72కోట్లతో సీసీ రోడ్లుగా మారుస్తున్నట్లు చెప్పారు. రూ.1.25కోట్లతో 2.350కిలోమీటర్ల డ్రైనేజీ కాల్వలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రూ.50లక్షలతో అంగడి రోడ్డు నిర్మాణం, వన్ వే లైట్ల ఏర్పాటు ఉంటుందన్నారు. రూ.25లక్షలతో మూడు జంక్షన్లు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

మీ వెంట నేను.. నా వెంట మీరుండాలి
40ఏళ్ల రాజకీయ జీవితంలో మరిపెడ మండలం తనకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నది. ప్రతీ ఎన్నికలో ఈ మండల ప్రజలు ఆదరిస్తున్నారు. మీకు సేవ చేసే భాగ్యం కలిపించినందుకు పేరు పేరున రుణపడి ఉం టా. రెండు చేతులు జోడించి పాదాభివందనం చేస్తు న్నా. ఇక ముందు కూడా మా కుటుంబంపై మీ ప్రేమనురాగాలు ఉండాలి అని ఎమ్మెల్యే రెడ్యా అన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
మరిపెడ మున్సిపల్ పరిధిలోని పలు పనుల శంకుస్థాపనకు హాజరైన మానుకోట ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్‌కు పట్టణ ప్రజలు ఘనస్వాగతం ఫలికారు. మహిళలు కోలాట నృత్యాలతో, డప్పు కళాకారులు కనక డప్పులతో ఎదురొచ్చి స్వాగతించారు. ఎంపీ, ఎమ్మెల్యేను మరిపెడ మున్సిపల్ అధికారులు గజమాలతో సత్కరించారు. మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్-పూల దంపతులు పూల మాలలు వేసి శాలువలతో సన్మానించారు. కార్యక్రమం లో ఎంపీ కవిత, గ్రంధాలయ సంస్థ జిల్లా చైర్మన్ నవీన్, జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిచంద్ర, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మానుకోట ఏఎంసీ మాజీ చైర్మన్ సత్తెన్న, మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ కే.మహేందర్‌రెడ్డి, మరిపెడ ఎంపీపీలు తాళ్లపెల్లి రాణిశ్రీనివాస్, గుగులోత్ అరుణరాంబాబు, జెడ్పీటీసీలు బాల్ని మాణిక్యం, తేజావత్ శారదరవీందర్, మాజీ వైస్ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, మరిపెడ మాజీ సర్పంచ్ పానుగోత్ రాంలాల్, ఎంపీటీసీలు వస్రాం, అంబరీష, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.

ప్రజా సేవకుడు ఎమ్మెల్యే రెడ్యా
నిరంతర ప్రజా సేవకుడు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అని టీఆర్‌ఎస్ యువ నేత డీఎస్ రవిచంద్ర అన్నారు. పట్టణంలో అభివృద్ధి పనుల ప్రా రంభోత్సవానికి ఎమ్మెల్యే రెడ్యాతో కలిసి ఆయన పాల్గొన్నారు. గతంలో మరిపెడబంగ్లా ఎలా ఉండే ది.. ఇప్పుడు ఎలా ఉండబోతున్నది ప్రజలకు వివరించారు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందే మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల అభివృద్ధికి ఎమ్మెల్యే రెడ్యా రూ.40లక్షలు మంజూరు చేయించారన్నారు. ఎన్నికల కోడ్ వల్ల పనులు అలస్యంగా ప్రారంభం అవుతున్నాయన్నారు. ఓ వైపు అభివృద్ధి పనులు చేస్తూ మరోవైపు రైతు పక్షపాతిగా రెడ్యా నిలుస్తున్నారన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు తీసుకరావడానికి ఎంతో కృషి చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. దసరా, దీపావళి వరకు డోర్నకల్ ప్రాంతానికి గోదావరి జలాలు వస్తాయన్నారు.
- డోర్నకల్ టీఆర్‌ఎస్ యువనేత డీఎస్ రవిచంద్ర

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles