ఎమ్మెల్సీగా నేడు పోచంపల్లి ప్రమాణం

Wed,June 19, 2019 02:26 AM

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అత్యంత మెజార్టీతో జాతీయ రికార్డును సృష్టించి గెలిచిన విషయం తెలిసిందే. వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికూడ మండలం వరికోలు గ్రామానికి చెందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెరవెనుక ఉన్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉండటమే కాకుండా.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పార్టీ ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు అంతే సన్నిహితంగా మెలుగుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తున్నారు. వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగిన కొండా మురళీధర్‌రావు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌తో వచ్చిన ఎమ్మెల్సీ పదవినీ రాజీనామా చేయాలని ఆ పార్టీ అన్ని విభాగాలు చేసిన డిమాండ్‌ మేరకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

దీంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీని సొంతం చేసుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించిన విషయమూ తెలిసిందే. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా మొత్తం 902 ఓట్లు ఉండగా అందులో ఇందులో 883 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అయిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి 848 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డికి కేవలం 23 ఓట్లు వచ్చాయి. బరిలో నిలిచిన ఐదుగురిలో నలుగురికి డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. మొత్తంగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి 825 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, బుధవారం శాసనమండలి చైర్మన్‌ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, జిల్లా 11 మంది ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌, కొత్తగా ఎన్నికైన ఆరు జిల్లాల జెడ్పీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మిత్రులు అనేక మంది హాజరు కాబోతున్నారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles