హరితహారానికి సర్వం సిద్ధం

Wed,June 19, 2019 02:24 AM

-జిల్లాలో రెండు కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
-బయ్యారంలో నర్సరీలు పరిశీలించిన పీడీ సూర్యనారాయణ
-విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీవో పై ఆగ్రహం
బయ్యారం, జూన్‌ 18 : పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యాక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం మండలంలోని వెంకటాపురం, కొత్తగూడెం, కంబాలపల్లి గ్రామాల్లోని నర్సరీలు, మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారం ద్వారా జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 371 నర్సరీల్లో సుమారు రెండు కోట్ల మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రైతుల పొలం గట్లపై మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు వివరించారు. ప్రతీ వ్యక్తి వారి ఇంట్లో మొక్కలు నాటాలని, అందుకోసం పండ్ల, అందానిచ్చె మొక్కలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణం ముమ్మరంగా జరుగుతున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో వోడీఎఫ్‌ జిల్లాగా ప్రకటించేంతదుకు జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య ఆదేశాలతో ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం గ్రామాల్లోని ప్రజలకు అవగాహణ కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతీ వ్యక్తి ఇంట్లో మరుగుదొడ్డి తప్పనిసరి అని లేకుంటే సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని తెలిపారు.

నర్సరీల నిర్వహణ తీరుపై ఆగ్రహం
ఉపాధి హామీ పథకంలో భాగంగా హరితహారం కోసం మండలంలో నిర్వహిస్తున్న నర్సరీలను పరిశీలించిన పీడీ సూర్యనారాయణ నిర్వహణ సరిగా లేకపోవటంతో ఏపీవో మధుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలకు నీరు సరిగా పోయకపోవడం, మొక్కలు ఎండి పోవడం, టెంట్ల నిర్వహణ సరిగా లేక పోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా మరో మారు సందర్శిస్తానని నిర్వహణ సరిగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటపతిరాజు, టీఏ శేఖర్‌, మంజుల తదితరులు ఉన్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles