లంచం అడిగితే జైలుకు పంపిస్తా

Tue,June 18, 2019 01:41 AM

-వారం రోజుల్లో అర్హులైన రైతులందరికీ పాసుపుస్తకాలు ఇవ్వాలి
-రైతులకు ఎదురు పెట్టుబడి ఇస్తున్న మహాత్ముడు కేసీఆర్‌
-కల్యాణలక్ష్మిలో అవకతవకలకు పాల్పడితే క్షమించేది లేదు
-నెలరోజుల తర్వాత ఏడాది పొడవునా సాగునీరు
-పాసుపుస్తకాలు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దయాకర్‌రావు
తొర్రూరు, నమస్తే తెలంగాణ, జూన్‌ 17: పాసు పుస్తకాల కోసం ఎవ్వరు లంచం అడిగినా జైలుకు పంపిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్యతో కలిసి సోమవారం తొర్రూరు డివిజన్‌ కేంద్రంలో 870 మంది రైతులకు, 155 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు పాసుపుస్తకాలు, చెక్కులను పంపిణీ చేశారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడంలో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చూపించిన ఉత్సాహం రైతుకు, పేదవారికి భూమిపై భద్రత కల్పించడంలో చూపించలేదని, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి చిక్కు ముడులతో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూరికార్డుల ప్రక్షాళన, నూతన పాసుపుస్తకాల జారీ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. పాసుపుస్తకాల కోసం ఎవ్వరు పైసలు అడిగినా లిఖితపూర్వంగా ఫిర్యాదు చేయాలని, వారిని సస్పెండ్‌ చేయించి జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు పరిష్కారం చూపి పాస్‌పుస్తకాలు జారీ చేయాలని, ఎవరి దగ్గర నయా పైసా తీసుకోకుండా కలెక్టర్‌ బాధ్యత తీసుకోవాలన్నారు.

తహసీల్దార్లు వివాదాస్పద స్థలాలను నేరుగా పరిశీలించి ఇరుగుపొరుగు రైతులను విచారించి, అసలైన వ్యక్తికి న్యాయం చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, నయా పైస తీసుకోకుండా రైతులకు భూకాగితాలు ఇస్తూ పాసుపుస్తకాల ద్వారా భూములపై హక్కులు కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతుల ఇబ్బందులు తొలగించాలని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి ఎకరానికి ఏటా రూ.10వేల ఎదురు పెట్టుబడి ఇస్తున్న మహాత్ముడు కేసీఆర్‌ అని కొనియాడారు. 95శాతం మేర పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడం అభినందించదగిందని, అయితే పెండింగ్‌ పాసుపుస్తకాలను వారంలో పంపిణీ చేయాలని చెప్పారు. కల్యాణలక్ష్మి విషయంలో ఎవరు లంచాలు అడిగినా క్షమించేది లేదని హెచ్చరించారు. ఆడపిల్ల పెళ్లి కోసం లగ్నంకోటు వేసుకోగానే కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకుంటే పెళ్లి రోజు నాటికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఇప్పించేలా కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనలో పూర్తిగా దెబ్బతిన్న సాగునీటి రంగాన్ని ప్రక్షాళన చేసి, కాళేశ్వరం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ద్వారా నెల రోజుల తర్వాత ఏడాది పొడువునా మన ప్రాంతానికి సాగునీరు అందిస్తామని, చెరువులు మత్తళ్లు పోయిస్తామని చెప్పారు.

మూడు నెలలుగా ఎన్నికల కోడ్‌ కారణంగా అభివృద్ధి పనులు చేయలేకపోయానని, జులై ఒకటి నుంచి 57ఏళ్లు దాటిన వారందరికీ రూ.2016 చొప్పున పింఛన్‌, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష రుణమాఫీ అమలు కాబోతున్నాయని ప్రకటించారు. అనంతరం కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్య మాట్లాడుతూ పట్టాదార్‌ పాస్‌పుస్తకాల పంపిణీపై రైతులకు న్యాయం చేసేందుకు ఎన్నో రకాల సమీక్షలు, సమావేశాలు నిర్వహించామన్నారు. ఏళ్లకొద్ది పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించి జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతులకు వందశాతం పాస్‌పుస్తకాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి వెంటనే పెండింగ్‌లో ఉన్న పాస్‌పుస్తకాలను అందజేసే విధంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ జీ మదన్‌లాల్‌, ఎంపీపీ కర్నె సోమయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌, నూతన ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించనున్న తుర్పాటి చిన్న అంజయ్య, రైతు సమస్వయ సమితి మండల కన్వీనర్‌ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రమేశ్‌బాబు, ఎంపీడీవో గుండె బాబు, ఎంఆర్‌ఐ భాస్కర్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles