జీవాలే మా ఇంటి దీపాలు

Sat,June 15, 2019 02:42 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జూన్‌ 13 : రాష్ట్రంలో అత్యధిక మైదాన ప్రాంతం, గిరిజన జనాభా కలిగి ఉండి.. నూతన జిల్లాగా ఆవిర్భవించిన మహబూబాబాద్‌లో పశు సంపద పెరుగుదలకు పుష్కలమైన అవకాశాలు కలిసి వస్తున్నాయి. జిల్లాలో కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా పశువైద్యాధికారి ముగ్గురి సమన్వయంతో ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుండడంతో సబ్సిడీ గొర్రెలు పెంచుకుంటున్న కాపరులకు కావాల్సినంత ఆదాయం సమకూరుతోంది. ఆరేళ్లలో జిల్లాలో గణనీయంగా పెరిగిన పశు సంపద గణాంకాలు ఇక్కడి పరిస్థితులకు దర్పణంగా నిలుస్తున్నాయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తేనే రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని, గట్టిగా విశ్వసించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ దిశగా కుల వృత్తిదారులకు బలోపేతం చేకూరేలా ఆర్థికంగా వారు ఎదగాలన్న సంకల్పంతో వివిధ పథకాలను ప్రవేశపెట్టి సబ్సిడీల రూపంలో గొర్రెలు, చేపలు, పాడిగేదెలు అందజేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆశించిన ఫలితాలు వాటి ప్రభావం, వ్యవసాయానికి అనుబంధంగా పశు సంపద అభివృద్ధి చెందితే రైతులకు చేకూరే ఆర్థిక ప్రయోజనాల ఫలాలు దరిచేరాయి. ప్రధానంగా గొర్రెల పెంపకంతో అనేక మంది కాపరులు, లబ్ధిదారులు ఆర్థిక ప్రయోజనాన్ని సాధించి అప్పులు లేకుండా కుటుంబ అవసరాలను తీర్చుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జంతువుల పెంపకానికి సంబంధించిన కుటుంబాల గణాంకాల్లో మహబూబాబాద్‌ జిల్లా ద్వితీయ స్థానంలో ఉండగా సబ్సిడీ గొర్రెల పంపిణీకి సంబంధించి రాష్ట్రంలో ఈ జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది.

జిల్లాలో పెరిగిన జీవసంపద
వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబాలు అత్యధికంగా ఉన్న మహబూబాబాద్‌ జిల్లాలో 2012 గణాంకాలతో పోల్చుకుంటే 2019లో జీవ సంపద రెట్టింపు అయింది. ప్రతి వంద కుటుంబాల్లో 55 కుటుంబాలు పశువులు, గొర్రెలు, పాడిగేదెలు, మేకలు, కోళ్లు, పందులు, కుక్కలు వంటి జంతువులను పెంచుతున్నారు. రాష్ట్రంలో జీవ సంపద కలిగి ఉన్న కుటుంబాల సంఖ్య అత్యధికంగా ఆసీఫాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో మహబూబాబాద్‌ జిల్లా ఉంది. 2012 లెక్కల ప్రకారం జిల్లాలోని 16 మండలాల్లో తెలుపు వర్ణపు గేదెలు 2,03,010 కాగా నలుపు వర్ణపు గేదెలు 1,17,210, గొర్రెలు 4,31,255, మేకలు 1,42,996, పందులు 8,557, కుక్కలు 3,267, కోళ్ల సంఖ్య 7,36,118గా గణాంకాలు ఉన్నాయి. 2019లో తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం వ్యవసాయంలో పెరిగిన యాంత్రీకరణ మూలంగా తెలుపు వర్ణపు గేదెల సంఖ్య మాత్రం కొంత మేర తగ్గింది. రాష్ట్రంలో జిల్లాలో తెలుపు వర్ణపు గేదెలు 1,83,250, నలుపు వర్ణపు గేదెలు 1,31,329, గొర్రెలు 7,03,873, మేకలు 1,80,848, పందులు 7,818, కుక్కలు 10,599, కోళ్ల సంఖ్య 11,09,803 కలిపి మొత్తం పెంపకానికి సంబంధించిన జీవ జాతుల సంఖ్య 23,27,520గా నమోదైంది. జిల్లాలో రోడ్డు, రైల్వే మార్గాలు రెండు ఉండడంతో పశు సంపద సంవృద్ధిగా పెరిగేందుకు అవకాశాలు కూడా కలిసి వచ్చాయి. చిన్న, సన్నకారు రైతులు జిల్లాలో 74.90శాతం ఉండడం కూడా జీవజాతుల పెంపకానికి అనుకూలంగా మారింది.

జీవాలతో ఆర్థిక జవసత్వం..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవులు, గొల్ల కురుమలు దేశంలోనే అన్ని రాష్ర్టాల వారి కంటే ఆర్థికంగా బలిస్టులు కావాలని మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ర్టాలకు మాంసం ఎగుమతులు చేసే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు లేని విధంగా సబ్సిడీలో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదటి విడతలో దిగ్విజయంగా పూర్తి చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలో యాదవులకు సంబంధించి 6,886 కుటుంబాలు ఉండగా వారి జనాభా 22,736 కాగా గొల్ల కుటుంబాలు 8,331 ఉండగా జనాభా 2,797 కాగా కురుమ కుటుంబాలు 1,142 కాగా జనాభా 3,928 కలిపి మొత్తం గొర్రెల కాపరుల కుటుంబాలు 16,359 ఉండగా వీరి జనాభా 53,761 ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఈ కుటుంబాలకు ప్రభుత్వం మొదటి విడతలో అందించిన సబ్సిడీ గొర్రెలకు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారు. గొర్రెల కాపరులు ప్రస్తుత వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలో గొర్రె ఎరువు ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. ఒక్కో గొర్రె ద్వారా ఏటా 36 నుంచి 40 కేజీల ఎరువు వస్తుండడంతో దుక్కులు దున్నే సమయంలో రసాయనిక ఎరువుల కంటే గొర్రె ఎరువుపైనే రైతులు అధికంగా ఆధారపడుతుంటారు. ఒక ట్రాక్టర్‌ గొర్రె ఎరువు రూ.6వేల వరకు డిమాండ్‌ పలుకుతుండడంతో ఇటు రైతులు, అటు కాపారులు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారు. జిల్లాలో కూరగాయలు, పూలసాగు పెరగడం వల్ల నాన్‌ ఆర్గానిక్‌ ఉత్పత్తులు రావడానికి ఈ ఎరువులు ఎంతో ఉపకరిస్తున్నాయి. పొలాలు, తోటల సాగు చేసే భూముల్లో ఒక రోజు రాత్రి మందను పడుకోబెడితే గొర్రెకు రూపాయి చొప్పున కాపరులు రైతుల నుంచి తీసుకుంటున్నారు.

నాలుగు ప్రాంతాల్లో మార్కెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు..
జిల్లాలో రోజువారీగా 2వేల కేజీల వరకు మాంసం విక్రయాలు జరుగుతున్నట్లు అధికారుల సర్వేలో తేలింది. కేజీ గొర్రె మాంసానికి ప్రాంతాల వారీగా రూ.500 నుంచి 600 వరకు ధర పలుకుతోంది. జిల్లాలో గొర్రెల సంఖ్య పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గిందని మాంసం విక్రయదారులు చెబుతున్నారు. మహబూబాబాద్‌, తొర్రూరు, డోర్నకల్‌, కేసముద్రం ప్రాంతాల్లో నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ వెజిటేబుల్‌ మార్కెట్లలోనే మాంస విక్రయాలకు ప్రత్యేక స్టాళ్లను నిర్మించాలని అధికారులు నిర్ణయించి ప్రతిపాదనలను పంపించారు. ఈ మార్కెట్ల నిర్మాణానికి స్థల కేటాయింపులు పూర్తి కాగానే పనులు ప్రారంభం కానున్నాయి.

గొర్రెల యూనిట్ల పంపిణీలో నాలుగో స్థానం..
గొర్రెల కాపరులకు సబ్సిడీలో గొర్రెల యూనిట్లను ప్రభుత్వం అందజేసింది. జిల్లాలో గతంలో 122 సొసైటీలు ఉండగా కొత్తగా మరో 105 సొసైటీలు ఏర్పాటయ్యాయి. ఇందులో 11వేల84 మంది పాత సభ్యులు కాగా కొత్తగా 12,691 మంది కాపరులు వారి పేర్లను నమోదు చేసుకోగా మొత్తం జిల్లాలో 23వేల775 మంది గొర్రెల కాపరులకు సొసైటీల్లో సభ్యత్వాలు నమోదై ఉన్నాయి. మొదటి విడతలో 2017 నుంచి 2019 వరకు జిల్లాలోని 16 మండలాల్లో కలిపి మొత్తం 11వేల886 యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉండగా 11,640 యూనిట్లు అంటే 97.93శాతం పంపిణీతో రాష్ట్రంలో జిల్లాను నాలుగో స్థానంలో నిలిపారు. పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లకు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న దానాను 11,083 యూనిట్ల, 11,383 యూనిట్ల గొర్రెలకు మందులను పంపిణీ చేశారు.

రెండో విడతలో 11,889 యూనిట్ల పంపిణీకి ప్రణాళిక..
గొర్రెల కాపరుల సొసైటీలోని సభ్యులకు జిల్లాలో రెండవ విడతలో 11,889 యూనిట్లను పంపిణీ చేయాలని అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. మొదటి విడత లబ్ధిదారులు మినహాయించి మిగిలిన వారికి మండలాల వారీగా ఎన్ని యూనిట్లు కేటాయించాలి అనే విషయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కలెక్టర్‌, ఎస్పీ, జిల్లా పశువైద్యాధికారి సమన్వయంతో వ్యవహరించారు. రెండు విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేయడంతో తొర్రూరు, మరిపెడ, గార్ల వద్ద మూడు చెక్‌పోస్టులను నెలకొల్పడంతో పోలీసుల సహకారంతో అక్రమ రవాణను అడ్డుకోవడంలో సఫలీకృతులయ్యారు.

అప్పులు చేసే అవసరం లేకుండా పోయింది :
ప్రభుత్వం సబ్సిడీలో అందించిన గొర్రెలను చక్కగా సాదుకుంటున్నా. 2017లో వ్యవసాయ పనులు చేసుకుంటూ బతికే నాకు యూనిట్‌ గొర్రెలు ఇచ్చారు. ఇప్పుడు వాటి సంఖ్య 60కి చేరింది. మధ్యలో నా కుటుంబ ఆర్థిక అవసరాల కోసం 10 గొర్రె పోతులను ఒక్కోటి రూ.6500 చొప్పున అమ్ముకున్నా. ప్రభుత్వం చేసిన సాయంతో ఆర్థిక అవసరాలకు అప్పులు చేసే అవసరం లేకుండా పోయింది. నా గొర్రెలను చూసి భరోసగా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రతి ఏటా 20 పిల్లలు వస్తున్నాయి. మంచిగా కష్టపడితే సంవత్సరానికి రెండు నుంచి మూడు లక్షలు సంపాదించుకోవచ్చు. ఇంతకు ముందు పిల్లల చదువుల గురించి గుబులు పుట్టేది. ఇప్పుడు దంతాలపల్లిలో అక్షర స్కూల్‌కు నా ఇద్దరు పిల్లలను పంపిస్తున్నా. ప్రభుత్వ సాయం అంటే ఇట్ల ఉండాలి.

బొల్లు మురళి, లబ్దిదారుడు, బ్రాహ్మణకొత్తపల్లి
జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి
పశు పోషణలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్న మహబూబాబాద్‌ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు తగిన కృషి చేస్తాం. ఈ దిశగా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో పశువైద్య అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలిస్తూ ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రభుత్వం పాడి రైతుల కోసం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు, వనరులు ఈ జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. పశువులు, గొర్రెలు, ఇతర సాదు జంతుల ఆరోగ్య భద్రతకు ఎప్పటికప్పుడు పశువైద్యులు బాధ్యతాయుతంగా పని చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం.

డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా పశువైద్యాధికారి
నాకు నా ఇద్దరు కుమారులు సంపత్‌, కుమార్‌కు ఏడాది క్రితం ప్రభుత్వం నుంచి మూడు యూనిట్ల గొర్రెలు వచ్చాయి. వీటిని సక్రమంగా సాదుకోవడంతో ఇప్పుడు వాటి సంఖ్య పిల్లలతో కలిసి వంద వరకు చేరాయి. మధ్యలో పండుగలప్పుడు కుటుంబ అవసరాలకు పది పొట్టేలు పిల్లలను అమ్ముకున్నాం. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను సాదుకోవడంతో మాకు ఇప్పుడు అప్పులు చేసే పని లేకుండాపోయింది. మా కళ్ల ముందు ఐదు నుంచి ఆరు లక్షల విలువ చేసే గొర్రెలు కన్పిస్తుండడంతో భరోసగా బతుకుతున్నాం. గొర్రెలు ఇవ్వడమే కాదు వాటికి మందులు, దాన కూడా ప్రభుత్వం సబ్సిడీలో ఇవ్వడం యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంత శ్రద్ధపెట్టిందో అర్థమవుతోంది.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles