మలేరియా, డెంగీ నివారణ చర్యలు చేపట్టాలి

Sat,June 15, 2019 02:41 AM

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ, జూన్‌ 14 : ఏజెన్సీ జిల్లాల్లో మలేరియా, డెంగీ నివారణకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పలు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో రాష్ట్రంలోని 10 ఏజెన్సీ జిల్లాలైన ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా మలేరియా ప్రోగ్రాం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, డెంగీ సంబంధించి ఏ ఒక్క కేసు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ సీహెచ్‌. శివలింగయ్య మాట్లాడుతూ.. మహబూబాబాద్‌ జిల్లాలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంబంధిత లైన్‌ డిపార్టెమెంట్‌ అధికారులను సమన్వయం చేసి డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని గంగారం, కోమట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 21 హై రిస్క్‌ విలేజ్‌లను గుర్తించి జూన్‌ 15వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు దోమల నివారణకు ప్రతీ శుక్రవారం ప్రత్యేక స్ప్రేయింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

గత సంవత్సరం జనవరి 2018 నుంచి 2019 వరకు జిల్లా వ్యాప్తంగా 41 డెంగీ కేసులు, 127 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుంచి మే వరకు కేవలం నాలుగు మలేరియా, రెండు డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. ప్రతీ 15 రోజులకోసారి మలేరియా, పీహెచ్‌సీ సిబ్బందితో సమీక్ష నిర్వహించి వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి జిల్లాస్థాయిలో రాపిడ్‌ యాక్షన్‌ టీంను తయారు చేసి ఏజెన్సీలో ఎక్కడైనా విష జ్వరాలు ప్రబలితే తక్షణమే వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం గది, పోస్టుమార్టం గదులు దగ్గర ఉండడంతో డెలివరీ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారన్నారు. పోస్టుమార్టం గదిని మార్చేందుకు కలెక్టర్‌ అనుమతి కోరగా వెంటనే మార్చాల్సిందిగా మంత్రి ఆదేశించారు. గూడురు ఆసుపత్రిలో డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది కోరత ఉన్నట్లు తెలపగా త్వరలో మంజూరు చేస్తానని తెలిపారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ శాంతకుమారి, కమిషనర్‌ యోగితారానా, పది జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మలేరియా పోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles