మనసు పెట్టి పనిచేయండి

Sat,June 15, 2019 02:40 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, జూన్‌ 14ః అధికారులకు.. రెక్వెస్ట్‌ చేసి చెప్తున్నా..ఉరుకుతే పొద్దు కూకదు.. జర మనుసు పెట్టి పని చేస్తే రైతుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోత్‌ రెడ్యానాయక్‌ అన్నారు. శుక్రవారం మరిపెడ మున్సిపల్‌ కేంద్రంలోని భార్గవ ఫంక్షన్‌ హాలులో మరిపెడ, నర్సింహులపేట, చిన్నగూడూరు, దంతాలపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు, రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ తొర్రూరు ఆర్డీవో టీ.ఈశ్వరయ్య అధ్యక్షతన జరుగగా ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ పాల్గొని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రెడ్యా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉన్న రైతులకు ఎకరాకు రూ.10వేలు ఈ యేడాది నుంచి పంట పెట్టుబడిగా ఇస్తున్నామన్నారు. ఏ కారణం చేతనైనా రైతు మృతి చెందితే ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. 24గంటల విద్యుత్‌ ఇస్తామన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రైతును రాజుగా చూడాలని ఎన్నో పథకాలు అమలు చేస్తే కొందరు అధికారుల పనితీరుతో వారికి చెందాల్సిన రైతు బంధు, రైతు బీమా వర్తించక ఆ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. జరుగరానిది జరిగి రైతు మరణిస్తే ఆ కుటుంబానికి సర్కారు సాయం అందక ఇబ్బంది పడుతారన్నారు. రైతుకు ఏ కష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదన్నారు. అన్నారు.

ప్రతీ రైతుకు కేసీఆర్‌ పట్టా ఇస్తానన్నారు
సీఎం కేసీఆర్‌ ప్రతీ రైతుకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకం ఇస్తానని చెప్పిన విషయాన్ని అధికారులకు రెడ్యానాయక్‌ గుర్తు చేశారు. ఎవరి భూమి వారికే ఉన్నది. కానీ, అధికారుల పొరపాటు వల్ల నో లేక ఏ ఇతర కారణాలతోనో నేటికీ ఊరూరా 20 శాతం మందికి కూడా పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందలేదన్నారు. ఇప్పటికైనా అధికారులతో జేసీ సమీక్షించి లోపం ఎక్కడ జరుగు తుందో, కారకులెవ్వరో తెలుకోవాలని కోరారు. మోఖాపై ఎవ్వరున్నారు..సాదాబైనామా కాగితంపై ఎంత భూమి ఉన్నది.తెలుసుకుని అధికారులు శ్రద్ధతో పని చేసి రైతులకు పట్టా పుస్తకాలు ఇవ్వాలన్నారు. కొద్ది రోజుల్లోనే మండలం ప్రకారం భూ రికార్డుల ప్రక్షాళనపై త్వరలోనే రివ్వ్యూ జరుపుతానని రెడ్యానాయక్‌ చెప్పారు.

పేదింటి బిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మీ పథకం ఓ వరమని రెడ్యా అన్నారు. ఈ పథకంతో ఎన్నో కుటుంబాలు సంతోష పడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ ఉద్యమిస్తున్నప్పుడు ఓ గిరిజనుడు తన బిడ్డ పెళ్లి కోసం అప్పుతెచ్చిన డబ్బు ప్రమాదవశాత్తు ఏర్పడిన మంటల్లో కాలి పోవడంతో కేసీఆర్‌ చలించి పోయారు. అప్పుడే ఆ గిరిజనుడికి రూ.లక్ష సహాయం అందచేసి ఆ పిల్ల పెళ్లి చేశారన్నారు. కేసీఆర్‌ కళ్లల్లో ఈ సమస్య ఎప్పుడు తచ్చాడుతుండడంతో ఆయన సీఎం అవ్వడమే అలస్యం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ లబ్ధిదారులను వేదింపులకు గురి చేయొద్దన్నారు. దరఖాస్తు చేసిన వెంటనే కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందేలా అధికారులు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలంలోని 267 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. మరో 277 మందికి చెక్కులు ఇవ్వాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో మరిపెడ, నర్సింహులపేట ఎంపీపీలు రాణి, సుజాత, చిన్నగూడూరు ఎంపీపీ వల్లూరి పద్మ, మరిపెడ జెడ్పీటీసీ బాల్ని మాణిక్యం, ఆర్డీవో ఈశ్వరయ్య, మరిపెడ, చిన్నగూడూరు, దంతాలపల్లి, నర్సింహులపేట తహసీల్దార్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles