బాలల పరిరక్షణకు పాటుపడాలి

Wed,June 12, 2019 02:04 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 11;జిల్లాలో బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మికులు రహిత జిల్లాగా చేయుటకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. బడిఈడు పిల్లలను పాఠశాలలకు వెళ్ళేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. బాల కార్మికులుగా మారిన పిల్లలను, ఇతర పిల్లలను గుర్తించాలన్నారు. సంబంధిత శాఖల సహకారంతో ఆ పిల్లల తల్లిదండ్రులకు సరైన ఉపాధి కలిపించి వారి పిల్లలను బాల కార్మికులుగా మారకుండా చూడాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను ఏర్పాటు చేసి పిల్లల హక్కులపై అవగాహన కలిపించి గ్రామాలను చైల్డ్ ప్రెండ్లీ విలేజ్‌గా మార్చాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ బాలికల వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠవాలలో, ఇతర పాఠశాలల్లో 1098 పోస్టర్లను, ప్రదర్శించి కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. బాలల హక్కులు హరించినపుడు, లైంగిక వేధింపులకు గురి అయినపుడు ఎలాంటి ఆపదలు అయినా 1098 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేసి సహాయం పొందవచ్చని వారిలో అవగాహన కలిపించాలన్నారు. ఐసిపిఎస్, చైల్డ్‌లైన్ రోజువారి కార్యక్రమాల వివరాలు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీరామ్, డీఎస్పీ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ భారతి, డిసిపిఓ కమలాకర్, చైల్డ్ లైన్ జిల్లా కో ఆర్డినేటర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles