పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలి

Wed,June 12, 2019 02:04 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 11:భూరికార్డుల ప్రక్షానలో భాగంగా జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు నవీనికరించిన పట్టాదారు పాసుపుస్తకాలు వెంటనే అందించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలోని 16 మండలాలలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రగతిపై గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. అర్హులైన దరఖాస్తు చేసుకున్న రైతులకు కొత్త పట్టేదారు పుస్తకాలు మంజూరు ఇంకను పూర్తి కాకుండా పెండింగ్‌లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దిశగా వెంటనే పరిష్కరించుటకు తగు చర్యలు చేపట్టి తిరిగి ఈ నెల 13వ తేదీన నిర్వహించు సమీక్ష నాటికి 100 శాతం పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ జరగాలని ఆదేశించారు.

రెవెన్యూ అధికారులు వీఆర్‌ఓలు నిర్లక్ష్య వైఖరిని వీడి అంకిత భావంతో పనిచేస్తూ పెండింగ్‌లో ఉన్న పట్టాదార్ పాసు పుస్తకాలు వేగవంతంగా అందించుటకు కృషి చేయాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్డీఓలు, తహశీల్దార్లు పర్యవేక్షణ నిర్వహించి పెండింగ్‌లో ఉన్న గ్రామాలను స్వయంగా క్షేత్రస్థాయిలో సందర్శించి త్వరితంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన సమీక్షిస్తూ జిల్లాలో ఇప్పటివరకు 1,34,467 పాస్‌పుస్తకాలు ముద్రించి 1,29, 468 పట్టాదారు పాసు పుస్తకాలు రైతు అందించడం జరిగిందన్నారు. డిజిటల్ సంతకాలు పూర్తయిన 14,015 పుస్తకాలను వెంటనే ముద్రించి పంపిణీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంకను పెండింగ్‌లో ఉన్న ఖాతాలు త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో అధికంగా 2033 పిఓటి కేసులున్నాయని, వాటిని శీఘ్రగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ మండలాల్లో డిజిటల్ సంతకాలు, బ్యాక్‌లాగ్ సక్సెషన్, మ్యూటేషన్, అర్హత గల సాదాబైనామాలకు సంబందించిన పెండింగ్‌లో ఉన్న 2,384 ఖాతాలను వెంటనే పరిష్కరించి పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీఓలు కొమురయ్య, ఈశ్వరయ్య, జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్సెపెక్టర్లు, వీఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles