మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం తగదు

Tue,June 11, 2019 02:06 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 10 : మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడం తగదని కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామాల, మండలాల వారీగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల చివరి నాటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు 100 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంవత్సరం కన్నా ఎక్కువ పెండింగ్‌లో ఉన్న మరుగుదొడ్లపై సమీక్షిస్తూ జిల్లాలో 22,983 మరుగుదొడ్లు పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. 22,264 మరుగుదొడ్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయని మిగిలిన 719 మరుగుదొడ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై బుధవారం మరోసారి సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయా మండలాల ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు, ఏపీవోలు బాధ్యత వహించి రాత్రింభవళ్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ జూన్ 30 నాటికి 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అంకుఠిత దీక్షతో కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డేవిడ్, డీపీఓ రంగాచారి, ఇంచార్జి డీఆర్డీఓ సూర్యనారాయణ, ఏపీడీ దయాకర్‌రావు, అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles