ట్రెంచ్ పనులను నిలిపేయండి

Tue,June 11, 2019 02:06 AM

-ఎమ్మెల్యే హరిప్రియ వినతితో అధికారులను ఆదేశించిన
-అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
బయ్యారం, జూన్ 10: బయ్యారం మండలంలో జరుగుతున్న అటవీ శాఖ ట్రెంచ్ పనులను నిలిపివేయాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మహబూబాబాద్ డీఎఫ్‌వో కిష్టాగౌడ్‌తో పాటు రేంజర్ కర్నావత్ వెంకన్నను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ కలిసి పోడు రైతుల సమస్యలు వివరించారు. బయ్యారం మండలంలోని మిర్యాల పెంట, పందిపంపుల గ్రామ సరిహద్దుల్లో జరగుతున్న ట్రెంచ్ పనుల కారణంగా గిరిజనులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. దశాబ్దాల కాలంగా పోడు భూముల ద్వారా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారి భూములను అటవీ శాఖ స్వాధీనం చేసుకునేందుకు ట్రెంచ్ పనులు నిర్వహిస్తుండడంతో గిరిజనులు పలుమార్లు తనను కలిసి ఆవేదనను వెలిబుచ్చుకున్నారని వివరించారు. అంతేకాకుండా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన సమయంలో నియోజకవర్గంలోని గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు సమస్యను వివరించడంతో వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. స్పందించిన అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మహబూబాబాద్ డీఎఫ్‌వో కిష్టాగౌడ్‌కు ఫోన్ చేసి భూములకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బయ్యారం మండలంలో నిర్వహిస్తున్న ట్రెంచ్ పనులతో పాటు పోడు భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సైతం తాత్కాలికంగా నిలిపివేయాలని తెలిపారు. ప్రభుత్వానికి చెడు పేరు తీసుకొచ్చేలా గిరిజలను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. ఎమ్మెల్యే హరిప్రియానాయక్ చొరవతో ట్రెంచ్ పనులు ఆపివేయాలని ఆదేశాలు రావడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles