హరితహారంలో 2.70 కోట్ల మొక్కలు లక్ష్యం

Sun,May 19, 2019 02:02 AM

మహబూబాబాద్ నమస్తే తెలంగాణ, మే 18 : తెలంగాణ హరితహరంలో 5వ విడుతలో భాగంగా వచ్చే జూలై నెలలో జిల్లాకు 2.70కోట్ల మొక్కలు నాటే లక్ష్యం నిర్ణయించినట్లు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాకు నాటే లక్ష్యాన్ని శాఖల వారీగా కేటాయిస్తూ ఆయా శాఖల జిల్లా అధికారులు కేటాయించిన లక్ష్యాన్ని సాధించుటకు ప్రదేశాలను గుర్తించాలని ఆదేశించారు. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను తెలంగాణ ఫారెస్ట్ ఇన్ఫాస్ట్రక్చర్ సిస్టమ్‌కు 25వ తేదీలోగా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కలు నాటే బాధ్యత వ్యవసాయ విస్తరణ అధికారులకు, రెవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్ బాధ్యత ఫీల్డ్ అసిస్టేంట్లకు, ఇనిస్టిట్యూషన్ ప్లాంటేషన్ గృహాల్లో మొక్కలు నాటే బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలకు అప్పగించాలని చెప్పారు. కేటాయించిన లక్ష్యాల్లో అధికంగా అటవీ శాఖ 90లక్షలు, వ్యవసాయ శాఖకు 80లక్షలు, డీఆర్డీఏకు 45లక్షల మొక్కలు కేటాయించినట్లు తెలిపారు. వచ్చేవారం నిర్వహించే సమీక్షలో వివరాలతో హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ గ్రామ పంచాయతీకి కనీసం 50వేల మొక్కలు నాటుటకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఇది వరకే పంచాయతీ కార్యదర్శులను ఆదేశించామన్నారు. జిల్లాలో కోటి మొక్కలు పెంచుతున్నట్లు, వచ్చే హరితహరంలో రైతుల్లో టేకు మెక్కల పెంపకంపై అవగాహన కల్పించి కనీసం 50చెట్లు నాటిస్తే ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద మొక్కకు 5 రూపాయల చొప్పున ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వో కిష్టగౌడ్, డీఏవో ఛత్రునాయక్, డీహెచ్‌ఎస్‌వో సూర్యనారాయణ, జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం టీజీఎఫ్‌ఎమ్‌ఐఎస్ వెబ్‌సైట్‌లో జిల్లాకు సంబంధించిన ఆయా శాఖల మొక్కలు నాటే వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles