కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

Sun,May 19, 2019 02:02 AM

మహబూబాబాద్ నమస్తే తెలంగాణ , మే 18 : ఈ నెల 27న జెడ్పీటీసీ, ఎంపీటీసీ 2019 ఎన్నికల లెక్కింపు సజావుగా జరుగుటకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారులకు, ఎంపీటీసీ ఆర్‌వో, సూపర్వైజర్లకు, ఎంపీడీవోలకు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమర్థవంతంగా ఓట్ల లెక్కింపు నిర్వహించుటకు తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని, మహబూబాబాద్, తొర్రూరు రెండు డివిజన్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియ లైవ్ వెబ్‌కాస్టింగ్‌ను అన్ని కౌంటింగ్ హాళ్లలో ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా పరిషత్ లైజనింగ్ అధికారిని ఆదేశించారు. ప్రతీ ఎంపీటీసీకి రెండు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసుకోవాలని, మొత్తం 8 రౌండ్లలో బ్యాలెట్ పత్రాల లెక్కింపు పూర్తి చేసుకుని సాయంత్రం 5 గంటలలోపు కౌంటింగ్ ముగిసేట్లు చూసుకోవాలన్నారు. పీవో డైరీని అందుబాటులో ఉంచుకోవాలని, ఎంపీటీసీ, ఆర్వోలే జెడ్పీటీసీ కౌంటింగ్‌కు ఏఆర్వోలుగా కూడా వ్యవహరిస్తారని తెలిపారు. స్ట్రాంగ్‌రూంను సీల్ ఏజెంట్ల సమక్షంలో తీస్తూ పూర్తి వీడియోగ్రఫీ చేయాలన్నారు. ఏజెంట్ ఆర్వో లు, సూపర్‌వైజర్లు ఉంటారని తెలిపారు. జెడ్పీటీసీకి తెలుపు, ఎంపీటీసీకి గులాబీ రంగు గల బ్యాలెట్ పత్రాలను కేటాయించామని, 25 బ్యాలెట్ పత్రాలను ఒక బండిల్‌గా చేసుకుని కౌంటింగ్ చేస్తారన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు, ఆర్వో వద్ద రెండు రోజుల ముందు 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, వారికే పాస్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ను జాగ్రత్తగా పరిశీలించాలని, కౌంటింగ్ సమయంలో రూంల వారీగా ప్రత్యేక డ్రమ్ములు కేటాయించుకోవాలన్నారు. అభ్యర్థికి వచ్చిన ఓట్లు 100కు ఒక బండిల్‌గా ఏర్పాటు చేసుకుని కౌంటింగ్ చేయాలన్నారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా ప్రణాళికబద్ధంగా కౌంటింగ్ నిర్వహించాలని, రిటర్నింగ్ అధికారులదే పూర్తిబాధ్యత అన్నారు. ఈ సమావేశంలో డీహెచ్‌ఎస్ సూర్యనారాయణ, డీపీవో రంగాచారి, ఆర్డీవోలు కొమురయ్య, ఈశ్వరయ్య, జెడ్పీటీసీ ఆర్వోలు, ఎంపీటీసీ ఆర్వోలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles