ఓటుకు పోటెత్తారు

Thu,May 16, 2019 01:53 AM

-మూడు విడతల్లో మహిళలే అధికం
-తుది విడతలో భారీగా పెరిగిన పోలింగ్‌
-ఈ నెల 27న ఓట్ల లెక్కింపు..
మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించిన పోలింగ్‌లో మహిళలు తమ సత్తా చాటారు. మూడు విడతల్లోను పురుషుల కంటే మహిళల ఓట్లే ఎక్కువగా నమోదు అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో నిర్వహించిన పోలింగ్‌లో కూడ మహిళల ఓట్లే అధికంగా నమోదు అయ్యాయి. అదే తరహాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో కూడ మహిళలే మరోమారు ముందు నడిచారని వెల్లడైంది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మూడు విడతల్లో నిర్వహించిన పోలింగ్‌లో అత్యధిక సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో పురుషులు 72,482 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, మహిళలు 74,442మంది, రెండో విడతలో పురుషులు 59,716మంది కాగా, 60,748మంది మహిళలు, మూడో విడతలో 70,431మంది పురుషులు కాగా, 71,306 మంది మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

మూడు విడతల్లో పోలింగ్‌ సరళిని ఒక్కసారి పరిశీలిస్తే అన్ని విడతల్లో మహిళలే పోలింగ్‌ కేంద్రాలకు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో 76.62శాతం, రెండో విడతలో 77.45శాతం, మూడో విడతలో 79.56శాతం నమోదు అయ్యింది. మొదటి విడత కంటే రెండో విడతలో 0.83పోలింగ్‌ శాతం అధికంగా నమోదు అయ్యింది. రెండో విడత కంటే మూడో విడతలో 2.11శాతం పోలింగ్‌ శాతం పెరిగింది. తొలి విడతలో పురుషులు ఓట్లు 72,482 పోలవ్వగా, మహిళల ఓట్లు 74,442ఓట్లు పోలయ్యాయి. అంటే పురుషుల కంటే మహిళల 1,960ఓట్లు ఎక్కువగా నమోదు అయ్యాయి. అదే విధంగా రెండో విడతలో పురుషుల ఓట్లు 59,716 ఓట్లు పోలింగ్‌ కాగా, మహిళల 60,748ఓట్లు పోలయ్యాయి. 1,032ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి.

మూడో విడతలో 70,431మంది పురుషుల ఓట్లు పోలవ్వగా, 71,306మంది మహిళల ఓట్లు పోలయ్యాయి. అంటే పురుషుల కంటే మహిళలు 875మంది ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొన్నారు. జిల్లాలో తొలి విడతలో 7మండలాల పరిధిలో బయ్యా రం, గార్ల, గంగారం, కొత్తగూడ, తొర్రూర్‌, పెద్దవంగర, డోర్నకల్‌ మండలాల పరిధిలో 7జెడ్పీటీసీ స్థానాలతో పాటు 64 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఏడు మండలాల పరిధిలో 70 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇందులో 6 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. అదే విధంగా రెండో విడతలో కురవి, మరిపెడ, చిన్నగూడూరు, దంతాలపల్లి, కురవి మండలాల పరిధిలో మొత్తం 5జెడ్పీటీసీలతో పాటు 53ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 10న ఎన్నికలు నిర్వహించారు. రెండో విడతలో 61ఎంపీటీసీ స్థానాలకు 8ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 53ఎంపీటీసీలతో పాటు 5జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. తుది విడతలో 4జెడ్పీటీసీలతో పాటు 66 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 67 ఎంపీటీసీ స్థానాలకు కేసముద్రం మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే.

మూడు విడతల్లో మహిళలదే పై చేయి..
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మూడు విడతల్లో మహిళలదే పై చేయిగా నిలిచింది. మొదటి విడతలో మొత్తం 95,201 పురుషుల ఓట్లు ఉండగా, 72,482 పోలయ్యాయి. 96,555 మహిళల ఓట్లకు 74,442 ఓట్లు పోలయ్యాయి. రెండో విడతలో మొత్తం 77321 పురుషుల ఓట్లు ఉండగా, 59,716 ఓట్లు నమోదు అయ్యాయి. 78,213 మహిళల ఓట్లు ఉండగా, 60,748 ఓట్లు పోలయ్యాయి. అదే విధంగా మూడో విడతలో పురుషులవి 88,720 ఉండగా, 70,431 మంది ఓటు వేశారు. అదే విధంగా మహిళల ఓట్లు 89,430 ఉండగా, 71,306మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా నమోదు అయ్యాయి. మూడు విడతల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మూడు విడతల్లో నూ మహిళలు తమ సత్తా చాటారు.

27న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
జిల్లాలో మొత్తం మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 198 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇందులో మూడు విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో 15 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 183 ఎంపీటీసీ స్థానాలతో పాటు 16 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు 23న వెల్లడి కానున్నాయి. వీటి తర్వాత 27న జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓట్ల లెక్కింపు కోసం రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, డోర్నకల్‌, కురవి, మహబూబాబాద్‌, కేసముద్రం, గూడూరు మండలాలకు చెందిన జెడ్పీటీసీలతో పాటు ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు మహబూబాబాద్‌ పట్టణంలోని ఫాతిమా హైస్కూల్‌లో ఏర్పాటు చేశారు. అదే విధంగా తొర్రూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో తొర్రూరు, పెద్దవంగర, నర్సింహులపేట, దంతాలపల్లి, మరిపెడ, చిన్నగూడూరు, నెల్లికుదురు మండలాలకు చెందిన ఓట్ల లెక్కింపు తొర్రూరు పట్టణంలో ఆర్యభట్ట పాఠశాలలో ఏర్పాటు చేశారు.

బ్యాలెట్‌ బాక్స్‌ల్లో భవితవ్యం..
జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో బ్యాలెట్‌ బాక్స్‌లను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు. వాటి వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్‌ 20న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా, ఈ నెల 27న కౌంటింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. అభ్యర్థులు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా సుడిగాలి ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్‌ బాక్స్‌ల్లో అభ్యర్థులు భవితవ్యం ఉంది. 27వరకు అభ్యర్థులకు లబ్‌డబ్‌ బాధలు తప్పేలా లేవు. మూడు విడతల పోలింగ్‌ పూర్తి కావడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్స్‌ల్లో దాగి ఉందని చెప్పాలి.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles