అర్హులకు పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలి

Thu,April 25, 2019 03:15 AM

- కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
- నిర్లక్ష్యం వహిస్తున్న వీఆర్వోలపై ఆగ్రహం
తొర్రూరు, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 24 : అర్హులైన ప్రతీ రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం అందజేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం తొర్రూరు ఆర్డీవో కార్యాలయంలో తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, ప్రగతిపై గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులు, వీఆర్వోలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పక్షం రోజుల క్రితం అర్హులై దరఖాస్తు చేసుకున్న రైతులకు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని ఆదేశించినప్పటికీ పెండింగ్‌లో ఉండడంపై సంబంధిత వీఆర్వోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్వోల వైఖరిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తహసీల్దార్లతో ఆర్డీవో సమీక్ష నిర్వహించి పెండింగ్‌లో ఉన్న పాస్‌పుస్తకాలను రెండు రోజుల్లోగా క్లియర్ చేయాలని ఆదేశించారు. జాప్యం జరిగితే సంబంధిత వీఆర్వోపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తొర్రూరు మండలంలో 17,201 ఖాతాలు ఉండగా 12,128 పాస్‌పుస్తకాలు ముద్రించినట్లు చెప్పారు. అందులో 10,418 మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశామన్నారు. మిగిలిన 4,594 ఖాతాల్లో అర్హత గల 1747 ఖాతాలకు వెంటనే పాస్‌బుక్కులు అందజేయాలని సూచించారు.

తొర్రూరు మండలంలో 90 శాతం పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించామని, మిగిలిన 10 శాతం కూడా అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. పెద్దవంగర మండలంలో 9,021 ఖాతాలు ఉండగా 5,425 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించినట్లు చెప్పారు. మిగిలిన 3,556 ఖాతాలు బార్బి కింద లేనివి 1640 ఉండగా మిగిలిన అర్హత గల 1956 ఖాతాలకు వెంటనే కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ఆదేశించారు. రైతులు దరఖాస్తు చేసుకున్నా కూడా పెండింగ్‌లో ఉంచడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే పాస్ పుస్తకాలు అందజేయాలన్నారు. ఈ సమీక్షలో ఆర్డీవో ఈశ్వరయ్య, జిల్లా ఉద్యానశాఖ అధికారి సూర్యనారాయణ, తొర్రూరు, పెద్దవంగర తహసీల్దార్లు రమేశ్‌బాబు, రవి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles