ఇరవై ఏళ్ల నిరీక్షణ....

Wed,April 24, 2019 03:15 AM

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
రెవెన్యూ అధికారుల తప్పిదంతో రికార్డుకెక్కని భూమి
పైసలు తీసుకొని పరాయి వారి పేర్లు నమోదు
భూమి లేదని తప్పుడు నివేదిక పంపిన రెవెన్యూ అధికారులు
తిరిగి తిరిగి...విసిగి వేసారిపోయాం
కొండంత భరోసాతో నమస్తే తెలంగాణను ఆశ్రయించిన బాధితురాలు
నర్సింహులపేట, ఏప్రిల్ 23.
వ్యవసాయం పండుగ కావాలి...రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలి అనే సంకల్పంతో ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. నిజాం కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులను ప్రక్షాళన చేపట్టి రైతుకు సాగు కష్టం తీర్చాలనే సంకల్పంతో రైతు బంధు సహాయం చేతికందిస్తోంది...కాని క్షేత్రస్థాయిలో కొంత మంది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. పాసు పుస్తకాల జారీలో కొర్రీలు పెడుతుండటంతో పేద రైతు మరింత బక్కచిక్కిపోతున్నాడు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం కనికరించడం లేదు. అధికారుల చిన్నపాటి నిర్లక్ష్యం రైతులను ఇబ్బందులపాలు చేస్తుంది. భూమిపై సర్వ హక్కులు ఉన్నా పాసు పుస్తకం జారీ చేయడంలో కొందరు అధికారులు అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఇదేంటని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి పనిలో మరింత జాప్యం చేస్తూ పాసు పుస్తకాల కోసం చేయి తడిపినా ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. చిన్నపని కోసం రెవెన్యూ అధికారులు ఏండ్ల తరబడి తిప్పుకుంటున్నారు. తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణినందు అర్జీ చేసుకున్నా భూమి సర్వే కోసం చాలాన్ కట్టినా నేటి వరకు ఆ భూమిని చూసి మోఖాపై పరిశీలన చేయకుండా నేను సేద్యం చేస్తున్న భూమిని పక్క రైతుల పేరున నమోదు చేయడం వలన నేను ఇప్పటి వరకు పట్టాదారు పాసు పుస్తకం, రైతు బంధు పొందలేకపోయాను. నాకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాను. నమస్తే తెలంగాణరైతు భూ సమస్యలపై ధర్మగంట పేరుతో న్యాయం చేస్తున్న కథనాలను చూసి తనకు భరోసా కల్పిస్తారనే ఆశతో ఆశ్రయించాను.

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన ఎస్‌కె.జానిభేగం అనే మహిళ తనకు పసుపు, కుంకుమ కింద ఇచ్చిన 18గుంటల భూమి 22ఏళ్ల క్రితం తల్లిదండ్రులు అప్పగించారు. అప్పటి నుండి ఆ భూమిని ఆమె తల్లి అయిన సయ్యద్ సర్వర్‌బీ పేరున ఉంది. ఆ భూమికి సంబంధించిన సర్వే నెంబర్ 250లో వేరే వారి పేర్లను రెవెన్యూ అధికారులు నమోదు చేసి అసలు భూమి హక్కుదారునికి భూమి లేదని అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో ఆ మహిళ కలెక్టర్‌కు గ్రీవెన్‌సెల్‌లో 24-2-2018లో ఫిర్యాదు చేసింది. అప్పటి కలెక్టర్ బాధితురాలికి న్యాయం చేయాలని తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ పని చేసిన వీఆర్‌ఓ నిర్లక్ష్యంతో భూమి లేదని తప్పుడు నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు గోడును వెల్లబోసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.

అరవైఏండ్ల క్రితం నుంచి మా తాత పేరునే ఉంది....
1960-61 పహాణీలో మా తాత అయిన సయ్యద్ మదారు ప్రభుత్వం నౌకరి ఇనాం కింద 250 సర్వే నెంబర్‌లో ఎకరం 14గుంటల భూమి ఇచ్చింది. అతని కుమార్తె సర్ధార్‌బీకి 18గుంటల భూమిని ఇచ్చాడు. సర్ధార్‌బీ తన కూతురు అయిన జానిభేగంకు 1995లో పసుపు, కుంకుమ కింద అదే 18గుంటల భూమిని ఇచ్చింది. అనంతరం ఆ భూమిని జానిభేగం వ్యవసాయం చేసుకుంటుంది. కొన్ని రోజుల తరువాత గ్రామంలోని కొంతమందికి కౌలుకు సైతం ఇచ్చింది. ప్రస్తుతం ఆ భూమి ఆమె ఆదీనంలోనే ఉంది. 250 సర్వే నెంబర్ మొత్తం భూమి మధ్య భాగంలో ఉన్న సర్ధార్‌బీ భూమిని నెంబర్ వేరే వ్యక్తులకు పట్టా చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు తమ గోడును వెల్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం....
తమ తల్లిదండ్రులు పసుపు, కుంకుమ కింద ఇచ్చిన 18గుంటల భూమిని తనకు పట్టా చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగా మారింది. మండల కేంద్రంలోని రెవెన్యూ అధికారులు మా తాత, అమ్మగారి పేరున ఉన్న భూమిని వేరే వ్యక్తుల పేరున పట్టా చేశారు. 251, 248లో ప్రభుత్వ (పోరంబోకు) భూమి ఉంది. ఈ భూమిని కొంత మంది సాగు చేసుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని రెవెన్యూ అధికారులు ముడుపులకు ఆశపడి అసలు పట్టా భూమి(250)ని ఆ వ్యక్తుల పేరున పట్టా చేశారు. అసలు పట్టాదారులమైన నాకు భూమిలేదని తప్పుడు నివేదికను తయారు చేసి అధికారులకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేసింది.

తాను తప్పుడు ప్రకటన ఇస్తే 18గుంటలు ప్రభుత్వానికి ఇస్తా : ఎస్‌కె.జానిభేగం
సర్వే నెంబర్ 248, 251లో ప్రభుత్వ భూమి ఉంది. నా పట్టా భూమి(250)ని గతంలో ఉన్న వీఆర్‌ఓ ముడుపులు తీసుకొని పట్టా చేశారు. ఒకవేళ నేను చెప్పిన విధంగా 248, 251లో ప్రభుత్వ భూమి లేదని, 250 సర్వే నెంబర్‌లో 18గుంటల భూమి నాకు లేదని అబద్దం చెప్పినచో నాకు ఉండబడిన సర్వే నెంబర్ 250లో ఉన్న 18గుంటల భూమిని ప్రభుత్వానికి దానంగా రాసిస్తాను. గతంలో పని చేసిన వీఆర్‌ఓ క్షేత్రస్థాయిలో తిరగకుండా ఎవరు ఏ భూమి దున్నుతున్నారో నిర్ధారణ చేసుకోకుండా నాలాంటి బీదవారి భూములను వేరే వారి పేరున పట్టా చేసి ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలి.

క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేయిస్తా : దొడ్డారపు సైదులు తహసీల్దార్ దంతాలపల్లి
250 సర్వే నెంబర్‌లో ప్రస్తుతం 7 గుంటలు మాత్రమే ఖాళీగా ఉంది. 2005-06 పహానీలో జానిబేగం తల్లి పేరునా 12 గుంటలు మాత్రమే ఉంది.2018-19 పహాణీలో జానిబేగం తల్లి పేరు లేకుండా ఖాళీగా ఉంది. 250 సర్వే నెంబర్‌తో పాటు పక్కన ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 248, 251ని సర్వే చేయించి బాధితురాలుకు న్యాయం చేసి రికార్డులో నమోదు చేయడం జరుగుతుంది.

60
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles