ఎన్నికల విధులను బాద్యతగా నిర్వహించాలి

Wed,April 24, 2019 03:13 AM

-సాదారణ ఎన్నికల పరిశీలకులు బి. శ్రీనివాస్
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 23ః
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అకుంఠిత దీక్షతో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని వరంగల్ అర్బన్,వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాలకు ఎన్నికల సంఘం నుండి నియమింపబడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సాధారణ ఎన్నికల పరిశీలకులు బి. శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్. శివలింగయ్యతో కలిసి మహబూబాబాద్ జిల్లా మూడు విడతలలో జరుగు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రెండవ రాండమైజేషన్ ఆన్‌లైన్ ద్వారా సిబ్బందిని కేటాయించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై చేపట్టిన చర్యలపై ఆయన ఎన్నికల అంశాల వారీగా నోడల్ ఆఫీసర్‌లతో సమీక్షించారు. గతంలో అసెంబ్లీ, గ్రామపంచాయతీ, లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించుటకు ఉత్సాహంగా ఉన్నారని అభినందిస్తూ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ల నిర్వహణలో కొన్ని తప్పులు జరిగాయని అన్నారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ల ముద్రణలో తప్పులు జరగకుండా తగు జాగ్రత్త వహించాలని అన్నారు. అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు తగినంతగా అవసరం మేరకు ముద్రించుకోవాలని అన్నారు. ఎన్నికల సిబ్బంది సంక్షేమం కోసం తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద సిబ్బందికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ జిల్లాలోని 16 జెడ్పీటీసీలు, 198 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికల నిర్వహణ మూడు దశలలో జరుగుతుందని తెలిపారు. అందుకుగాను జెడ్పీటీసీకి ఒక జిల్లా స్థాయి అధికారిని రిటర్నింగ్ అధికారిగా మూడు ఎంపీటీసీలకు గెజిటెడ్ స్థాయి అధికారిని రిటర్నింగ్ అధికారిగా నియమించడం జరిగింది అన్నారు.

రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు, నామినేషన్ల స్వీకరణ, స్కూటిని, గుర్తుల కేటాయింపు మొదలగు అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలోని 461 గ్రామపంచాయతీలలో 1085 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 6271 పోలింగ్ సిబ్బందిని 30 శాతం అధికారికంగా నియమించడం జరిగిందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా ప్రతి మండలానికి ఒకటి చొప్పున ప్లయింగ్ స్కాడ్ జిల్లాలోని 4 సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచడం జరిగిందన్నారు. ఎన్నికలలో పాల్గొన్న సిబ్బందికి నీడ, భోజనం ఇతర అన్ని సదుపాయాలు కలిపించడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లోనూ ఎలాంటి సంఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించామని అదే స్పూర్తితో ఈ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. గత ఎన్నికల్లో 4000 మందిని బైండ్‌ఓవర్ చేశామని అన్నారు. ఇరవై రెండు వందల మందిని రౌడీ షీటర్‌లో గుర్తించి తగు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 19 గ్రామాలను సమస్యాత్మకంగా గుర్తించి అక్కడి పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లతో పాటు సీసీ కెమెరాలు, మొత్తం పోలింగ్ ప్రక్రియ వీడియోగ్రఫీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, ఆర్డీవోలు, డీఎస్పీలు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles